22, ఏప్రిల్ 2012, ఆదివారం

లైఫ్ బాయ్ ఇక్కడ ఉంది....

తీరికగా వారాంతం కాళ్ళు బార్లాజాపి కూచుని విసుగుపుట్టి స్నానం చేయాలని అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళీన నన్ను ఖాళీ సబ్బుపెట్టె వెక్కిరించింది.అపుడు నెమ్మదిగా నాలిక కరుచుకుని పక్క వీధిలో ఉన్న పచారి కొట్టుకు సబ్బు కొనుక్కుందామని వెళ్ళాను.

అపుడే అక్కడికి ఒక అమ్మాయి ఆకుపచ్చ చుడీదార్లో వచ్చింది.అప్రయత్నంగా నా కళ్ళు అటువైపు ఆకర్షించబడ్డాయి,ఇది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య దీనికి మనమేమీ చేయలేము.కానీ అటు తిరిగిన నన్ను ఆ అమ్మాయి కన్నా ఎక్కువగా ఆకర్షించింది అక్కడ గోడకి ఉన్న ఒక ప్రకటన.అది లైప్ఫ్బాయ్ సబ్బుది.అది చూడగానే నాకు ఒంటికి ఒక్కసారి కూడా లైఫ్బాయ్ సబ్బు రుద్దుకునే భాగ్యం కలగలేదు కదా అనే విషయం గుర్తు వచ్చి ఒకింత చింతించాను.అసలు నాకు ఇంతవరకూ లైఫ్బాయ్ సబ్బు రుద్దుకునే భాగ్యం ఎందుకు కలగలేదూ అంటే కింద పేరా చదవాలి.

కాసేపు ఉండు శివయ్యా...నేను స్నానం చేసి వస్తాను అని మురళి అన్నపుడల్లా నాకు అక్కడే ఉండి మురళి స్నానం చేసేంతవరకూ చూడలని ఉండేది.ఎందుకంటే మురళి వాళ్ళ ఇంట్లో వాడేది లైఫ్బాయ్ సబ్బు మరి. లైఫ్బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని చిన్నపుడు దూరదర్శన్ రోజులలో ఈ లైఫ్బాయ్ సబ్బుకి వఛ్ఛే ప్రకటన అంటే నాకు చచ్చేంత ఇష్టం .ఎర్రగా పెద్దగా ఒక రకమైన వింత వాసనతో ఉండే ఆ సబ్బుని చూస్తే నాకు కూడా ఆ ప్రకటనలో పిల్లాడిలాగా లైఫ్బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని పాటపాడుతూ స్నానం చేయాలని,ఆ పిల్లాడిలాగానే టర్కీ టవల్ కట్టుకుని లైఫ్బాయ్ అని అరుస్తూ ఇంట్లోకి పరిగెట్టాలని భలే ఇదిగా ఉండేది.

దీనికి తోడు మురళి వాళ్ళ ఇంట్లోను, భాస్కర్ అన్న వాళ్ళ ఇంట్లోను లైఫ్బాయ్ సబ్బే వాడేవాళ్ళు.వాళ్ళూ రోజూ స్నానం చేసేటపుడు చక్కగా ఆ ప్రకటనలో వచ్చే పాట పాడుతూ స్నానం చేసి లైఫ్బాయ్ అని అరుస్తూ ఇంటికి బోసి మొలతో పరిగెట్టేవాల్లు.మా ఇంట్లో ఒక టర్కీ టవల్ ఉండేది అది మా నాన్న వాడేవారు.కానీ అది చుట్టుకుని అరవడానికి లైఫ్బాయ్ సబ్బే ఉండేది కాదు.

దీనికి ఇంత గోల ఎందుకు,ఒక సబ్బు కొనుక్కోక పొయావా అని అడగబోతున్నారా?అక్కడే ఉంది అసలైన చిక్కు,మా అమ్మకి లైఫ్బాయ్ సబ్బు అంటే ఒక చీప్ అభిప్రాయం ఉండేది,మా ఇంట్లో ఎపుడు చూసినా లక్స్ సబ్బే తెచ్చేవాళ్ళు.మరీ గొడవ చేసి అడిగినా నెత్తి మీద టెంకె జిల్ల పడేదే కానీ తరువాతి నెల సరుకు చిట్టాలో లైఫ్బాయ్ సబ్బు ఉండేది కాదు.

లక్స్ వాడడానికి నీకు వచ్చిన కష్టమేమిటి అని ఇంకొక ప్రశ్న ఉదయించిందా? ఆ సబ్బుకి వచ్చే ప్రకటన ఎలా ఉండెదంటే మెరిసే చర్మం కోసం లక్స్,నక్షత్రం లాంటి మెరుపు కోసం లక్స్ ఇలా ఉండేవి.నల్లటి నేరేడు కాయలాంటి నా శరీరాన్ని చూసి నక్షత్రంలాంటి మెరుపు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కాక ఆ ప్రకటనలకి ఎపుడూ సినిమావాళ్ళు వచ్చే వాళ్ళు,ఎపుడూ ఒక పిలకాయ వచ్చినట్టు నేను చూడలా.ఇక నేను స్నానం చేస్తూ ఏం పాట పాడుకోవాలి?

ఈ కష్టాలు ఇలా ఉంటే, మేము ఎప్పుడైనా కొట్టుకునే ఆట ఆడుకుంటున్నపుడు(అప్పటిలో దూరదర్శన్లో సినిమాలు చూసి ఆ ఫైటింగులు ప్రాక్టీస్ చేసే వాళ్ళం,తరువాత మా ప్రతిభా పాటవాలు ఒకరి మీద మరొకరు ప్రదర్శించుకునే వాళ్ళం అదే ఈ కొట్టుకునే ఆట) మురళి గాడు వాళ్ళందరూ అరెయ్ నాది లైఫ్బాయ్ సబ్బు రా, నాకేమి కాదు అని పిడి గుద్దులు గుద్దుతూ ఉంటే,నేను అరెయ్ నాది నక్షత్రం లాంటి నిగారింపురా అని బదులు చెప్పలేక ఆ పిడి గుద్దులకి లొంగిపొయేవాడిని :(

ఇలా ప్రతీ కొట్టూకునే ఆటలోనూ ప్రత్యర్థులకు లొంగిపొతూ,టర్కీ టవల్ ఉన్నా కూడా అది వాడలేకపొతున్నాను అనే బాధతో కుంగిపొతూ ఉండగా ఒక రోజు అద్భుతమైన అవిడియా ఒకటి తట్టింది.అప్పటిలో మావి అన్ని పూరిళ్ళూ,ఒక ఇంటికీ ఇంకొక ఇంటికీ మధ్య గోడలు కూడా ఉండేవి కావు.పందులూ,కుక్కలూ అపుడపుడూ పందికొక్కులూ అవి ఇవీ తీసుకుపొతూ ఉండేవి,నేను కూడా సగం అరిగిపోయిన మురళి వాళ్ళ లైఫ్బాయ్ సబ్బుని ఎత్తుకువెళ్తే ఏ పందికొక్కో ఎత్తుకుపొయింది అనుకుంటారు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసాను.

ఒక ప్రణాలిక రచించాను పక్కాగా,శనివారం మధ్యానం ఒకాపూట బడి ఐపొగానే అన్నం తినేసి ఆడుకుంటాను అని తాతయ్యకి చెప్పి, చిన్నగా మురళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం,తరువాత చటుక్కున ఎవరూ చూడకుండా సబ్బుని జేబులో వేసుకోవడం.ప్రణాలిక ప్రకారమే సబ్బుని జేబులో వేసుకున్నాను.తరువాత ఎవరైనా చూసినా ఇది పంది కొక్కు ఎత్తుకు వచ్చింది అనిపించేందుకు గాను దాన్ని కొద్దిగా కొరికి గాట్లు పడేలా చేసాను. ఇంటికి వచ్చాక దాన్ని ఎక్కడ దాచాలా అన్న ప్రశ్న మొదలైంది.ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని వంటింట్లో మా కిరసనాయిలు స్టవ్ వెనక దాచిపెట్టాను, ఆ రాత్రి అంతా తరువాతి రోజు పొద్దున్న ఆరోగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్బాయ్ అని పాటలు పాడుకుంటూ,మా ఆకుపచ్చ టర్కీ టవల్ కట్టుకుని నారింజ చెట్టు కింద నుంచి ఇంట్లోకి పరిగెడుతున్నట్టు ఊహించుకుంటూ మాటి మాటికీ పొద్దునెపుడు ఔతుంది నాన్న అంటూ నస పెడుతూ ఎప్పటికో పడుకున్నాను.

తెల్లారింది,కోడి కూసింది,అమ్మ లేపింది, ఆదరా బాదరగా పళ్ళు తోముకుని, మా నాన్న స్నానం చేసిందాకా ఆగి(టర్కీ టవల్ కోసం) సబ్బుకోసం స్టవ్ వెనక చేయి పెట్టి చూద్దును కదా సబ్బు లేదు.మాయం.ఏమైంది అని ఎవరినైనా అడగడానికి కూడా లేదు.బిందెల వెనకా, తప్పేలాల కిందా వంటిల్లు మొత్తం వెతికి చూసాను,కనపడలేదు.ఇక తప్పేది లేక అడిగాను అమ్మని.మా,మా నిన్న పందికొక్కు ఎత్తుకుపొయిన మురళి వాళ్ళ సబ్బు నాకు దొరికింది మా,నేను తెచ్చి ఇక్కడ పెట్టాను ఏదీ అని. మా అమ్మ నాలుగు తిట్టి ఆ సబ్బు బయట విసిరేసాను అని చెప్పింది,నిజంగా పందికొక్కే తీసుకు వచ్చింది అనుకుని.

నా ఆశల సౌధం కూలిపోయింది,నా ఆరోగ్యానికి ఆ ఆదివారం కూడా రక్షణ లేకుండా పొయింది.ఆ తరువాత మాడిపోయిన మొహం తో, నక్షత్రం లాంటి నిగారింపుతో వెళ్ళాను,ప్రత్యర్ధుల చేతిలో పిడి గుద్దులు తినడానికి.

కొసమెరుపు: మా అమ్మకి లైఫబాయ్ సబ్బు మీద ఇప్పటికీ అభిప్రాయం మారలేదు, ఈ రోజు నేను లైఫ్బాయ్ కొని దానితో స్నానం చేసి మా అమ్మకి చెపితే ఇప్పటికీ అదే మాట అంది,ఆ సబ్బుతోనా ఐతే ఇంకోసారి చేయి స్నానం అని.

1 కామెంట్‌: