15, నవంబర్ 2010, సోమవారం

తాతయ్య కబుర్లు-1

ఆనందోబ్రహ్మ అయిదవసారో,ఆరవసారో చదువుతున్నాను.ఎందుకో ఈ సారి ఎప్పటి కన్నా,కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతుంది మరి.సోమయాజికి తన తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు యండమూరి.

అందమైన జీవితంలో మల్లాది గారు చెప్పినట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ తాతయా లేదా అమ్మమ్మతో కొంత కాలమైనా గడిపే అవకాశం రావాలి.ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశం ఉండబోదనుకుంటా.ఈ విషయంలో నేను చాలా,చాలా అదృష్టవంతుడిని.నాకు మా ఇద్దరు తాతయ్యలతోటి చాలా చక్కని అనుబంధం ఉంది.నాకు తెలిసి మా నాన్న తరుపు బంధువుల పిల్లలు, అంటే మా బావలు,వదినల కంటే మా తాతయ్యతో నాకే చనువు ఎక్కువ.మా తాతయ్యతో నాకున్న అనుబంధాన్ని మీతో పంచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం.


నేను చిన్నపుడు మాఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో చదువుకున్నాను.ప్రతీ రోజూ రిక్షాలో వెళ్ళి వచ్చేవాడిని.సాయంత్రం నేను ఇంటికి వచ్చే వేళకి నాకోసం ఇంటి ముందు ఎదురు చూసేవాడు.రిక్షా ఇంటి ముందు ఆగగానే దాని కొక్కేనికి ఉన్న నా స్కూల్ బ్యాగ్ తీసుకుని,నా వేలు పట్టుకుని నాను ఇంటికి లోపలికి తీసుకుని వెళ్ళేవాడు.చక్కగా నాకు వేరే బట్టలు తొడిగి నా చేత హోంవర్క్ చేయించేవాడు.

నేను చిన్నపుడు లెక్కల్లో చాలా వీకు(ఇప్పుడు కూడా),అందుకని ఓపికగా ప్రతీ అంకె ముందూ గీతలుగీయిస్తూ,వాటిని కొట్టేయిస్తూ నాకు కూడికలు,తీసివేతలు చెప్పేవాడు. హెచ్చవేతలు చేయడానికి మాత్రం పిచ్చి లేపే వాడిని.

ఇప్పటికీ మా అమ్మ అంటూ ఉంటుంది,నాకు నాలుగు అక్షరం ముక్కలు అబ్బాయంటే దానికి కారణం మీ తాతయ్యేరా అని.మా అమ్మ కూడా నేను చదువుకున్న స్కూల్ లోనే పని చేసేది.తను నా కన్న కొంచెం లేట్ గా వచ్చేది రోజూ.తను వచ్చేసరికి నేను గోనె పట్టా మీద పందిరి గుంజకి ఆనుకుని ఎక్కాలు చదువుతూ ఉండేవాడిని.

మా తాతయ్య చదువు దగ్గర ఎంత ఖచ్చితంగా ఉండేవాడంటే,ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రశ్న కి సమాధానం సరిగా రాకపోతే,ఏ వార్తలు చూస్తున్నపుడో ఒప్పచెప్పించుకోమని మా నాన దగ్గరికి వేళ్ళేవాడిని.మా నాన వార్తలలో పడి నేనేం చెప్తున్నానో పట్టించుకునేవారు కాదు.ఒకసారి మా తాతయ్య అది గమనించి మా నాన్న దగ్గరినుండి నా నోట్స్ లాక్కుని నన్ను నాలుగు తగిలించి మొత్తం సమాధానం వచ్చిందాక చదివించాడు.

ఒక సారి పరీక్షలలో ర్యాంక్ రాకపోవడం వల్ల ప్రైజ్ కోల్పోయి ఏడుస్తుంటే,ఏడిస్తే ర్యాంక్ రాదు,చదివితే వస్తుందని చెప్పితరువాతి పరీక్షలకి నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని చదివించాడు.ఆ తరువాతి పరీక్షలలో నాకు క్లాస్స్ లో మొదటి ర్యాంక్ వచ్చింది.కానీ,ఈసారి మా స్కూల్ వాళ్ళు ఎలాంటి ప్రైజ్ ఇవ్వలేదు.అపుడు మా తాతయ్యే ఒక పెన్ నాకు కొనిచ్చ్హాడు.దానిని నేను ఎంతో మురిపెంగా మరుసటి రోజు స్కూల్ లో అందరికి చూపించాను.అదే రోజు ఆ పెన్ పోగొట్టుకున్నాను కూడా. చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు తలుచుకుంటే.

మా తాతయ్య గురించి చెప్పినపుడు మూడు విషయాలు చెప్పకుంటే అది అసంపూర్ణం. అవి

1.పేకాట.

2.క్రికెట్.

3.సిగరెట్.

వీటి గురించి తరువాతి టపాలో.2 కామెంట్‌లు:

  1. పర్వాలేదు. నువ్వు చెప్పినట్లు ఆ మూడింటిగురించి రాస్తేగానీ, సంపూర్ణంగా అనిపించదేమో.

    నీలాగ కాకపోయినా సంవత్సరానికి రెండుమ్-మూణ్ణెల్లు మాకూ ఆ అదృష్టం దొరికింది బాబూ. ఈ తాతయ్య (అమ్మకి నాన్న), ఇంకో తాతయ్య (నాన్నకి నాన్న) బావాబావమరుదులు కావున.

    ఇద్దరూ టీవీకి రెండువైపులా తలలు అడ్డంపెట్టి ఒకరు గోల్డుఫ్లేకు, ఇంకోకరు సిజర్సు వెలిగించి పేకాడుతూ క్రికెటర్లని తిడుతూ - ఆ అనుభవాలు అందరికీ దొరకవు.

    రిప్లయితొలగించండి