3, జనవరి 2012, మంగళవారం

సుమన్ అభిమానులారా రండి!కలిసి చింతిద్దాం.

ఇలా ఔతుందని అనుకోలేదు, అసలు కలలో కూడా ఎపుడూ అనుకోలేదు.

నా మటుకు నేను నా పని చూసుకుని రాత్రి భోజనం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఒక తెలుగు తెలిసిన మిత్రుడు.వచ్చిన వాడు ఊరక ఉండక ఆ పిడుగులాంటి వార్త నా చెవిన వేసాడు.ఆ క్షణం, ఆ వార్త విన్న క్షణం నా కాళ్ళ కింద నేల బీటలు కొట్టింది, నా కళ్ళ నీరు కాలువలు కట్టింది.ఇంకా ఆకాశం కృంగలేదేమి?, జలధులుప్పొంగలేదేమి? ప్రళయం రాలేదేమి?

ఈ టి.వి గ్రూపుని టి.వి.18 గ్రూపు కొన్నదనేది ఆ వార్త,వాడు దాని వెనకాల గల వ్యాపార కోణాలు ఏకరువు పెడుతున్నాడు.కానీ నేను అవేమీ పట్టించుకునే స్థితిలో లేను.అప్పటికే నా మనసు మూగగా రోదించడం మొదలు పెట్టింది.ఆ క్షణం నా మనసుని ముక్కలు చేసిన ఊహ ఒక్కటే.ఇక మన నవరసాల నాయకుడి భీభత్స భయానక రౌద్ర రసాభినయం చూడకుండానే ఆ పరంపర కి అడ్డుకట్ట పడబోతుందా అని. ఇక సుమన్ బాబు ప్రీమియర్ షో లు ఉండవేమో అనే ఆలొచనే నన్ను అధః పాతాళానికి తోసేసింది.(అసలు వాడి బాధ తట్టుకోలేకే రామోజీ రావు ఈ.టి.వి ని అమ్మేసాడని కూడా కూసాడు మా మిత్రుడు,కానీ అలాంటి రసహృదయం లేని వాళ్ళ మాటలు నేను నమ్మను).

అసలు సుమన్ బాబు లేని ఈ.టి.వి ని, సూర్యుడు లేని లోకాన్ని ఊహించగలమా?కొండొక గుజ్జు రూపమున ఆ పళంగా బుల్లితెరని బల్లిలా అంటిపెట్టుకుని ఇంత కాలంగా మనం వద్దుమొర్రో అంటున్నా వినకుండా తన విశ్వరూపంతో వినోదాన్ని పంచిన బాబు దివ్య మంగళ రూపాన్ని ఇక మీదట చూడలేమేమో అన్న ఊహ నాకు కలిగినపుడు నా మనసులో కలిగిన అలజడిని వర్ణించడానికి కాళిదాసు అంతటి వాడికి కూడా ఉపమానం దొరకదు మళ్ళీ సుమన్ బాబే సుమనోహారాలు కొనసాగింపులో నాలుగు కొత్త వర్ణనలు చేయాలి.

ఎన్నని?అసలెన్నని? మన సుమన్ బాబు చేసిన ప్రయోగాలు(కొండకచో అవి మానవ మనుగడకి ప్రమాదాలుగా పరిగణింపబడినాకూడా).ఒకటా రెండా? ఆ చిట్టాకి అంతమెక్కడ?అంతరంగాలు అన్న పేరుతో తరాలు మారినా తరగని ధారావాహికని తీసాడు.ఎండమావులతో ప్రజల చేత కన్నీటీ జళ్ళు కురిపించాడు.కళంకిత బిరుదాంకితుడయాడు.ఇవన్నీ ఒక ఎత్తు.ఈ మధ్య ప్రజల మీద సంధిస్తున్న టెలీఫిల్మాస్త్రాలు ఇంకొకెత్తు. శ్రి కృష్ణ పరమాత్మ రూపం ధరించి జనుల గుండెలు కొల్ల కొట్టినా, డాన్ లా వచ్చి నాన్ స్టాప్ గా బాదినా అది ఆయనకి మాత్రమే సాధ్యమయే విద్య.

ఈ మధ్య మరీ ప్రజలలో ప్రశాంతత ఎక్కువైందని గమనించిన బాబు, నెలకో టెలీఫిలింవేసి లయ కారకుడినని నిరూపించుకున్నాడు.అసలు నేనైతే బాబు ఎప్పటి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ ఉన్న "సందడి" అనే చిత్ర రాజాన్ని జనవరి 1 న వేసి ఈ కొత్త సంవత్సరానికి ఒక అర్థాన్ని, నా జీవితానికి ఒక పరమార్థాన్ని చూపిస్తాడని అనుకున్నాను.కానీ బాబు నన్ను నిరాశ పరిచాడు.ఐతేనేమి?ఇహనో ఇప్పుడో అది ప్రసారమౌతుంది. కానీ ఆ తరువాత?


నా బాధ సరే మన నెమలికన్ను మురళి గారు?ఎప్పటి నుంచో బాబు ఇహనో రేపో ఒక అద్భుత జానపద చిత్రం చేస్తాడని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వారి ఆశ తీరదేమో అని నా కళ్ళు చెమర్చాయి.మరి మన కొత్తావకాయ గారి సంగతి? వారి బాధ వర్ణనాతీతం.

దేవుడా ఏమిటీ అకాల వైపరీత్యం? బహుశా 2012 లో ప్రళయం వచ్చేది ఇందుకేనేమో? బాబు ని చూడ లేని బ్రతుకు వృధా అని ఆ పరమాత్మకి కూడా తెలిసిందేమో.

20 కామెంట్‌లు:

  1. బాధపడకండి విశ్వనాథ్ గారూ....బాధపడకండి. దేవుడున్నాడు. శ్రీకృష్ణ బలరామ యుద్ధంలో సుమన్ బాబు చేతిలో చక్రం అడ్డేసి ఈటీవీ,ఈటీవీ 2 (తెలుగు చానెళ్ళని) మాత్రం ఆ దుష్కర ముష్కర మూకల చేతిలో పడకుండా కాపాడాడు. మనలాంటి అభిమానుల గుండెల్లో గ్రానైట్ పేలకుండా ఆపగలిగాడు. మనందరి అభిమాన నటుడు, నసరసనటనా సార్వభౌమ, టెర్రర్ స్టార్ సుమన్ బాబు పది కాలాల పాటు మనతోనే ఉంటాడు. మనల్ని అలరిస్తూనే ఉంటాడు.

    రిప్లయితొలగించండి
  2. మేము ఈటివి ఛానల్ పెట్టించుకోలేదు కాబట్టి, సుమన్ గారి కళాఖండాలు చూసే అదృష్టం మాకు దక్కలేదు కాబట్టి మీ అంత సంతాపం వ్యక్తం చెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.

    రిప్లయితొలగించండి
  3. ఈ సుమన్ గారికి ఇంత మంది ఫన్కాలు వున్నారు గాని, (గురువు గారు బుల్సు గారితో చేర్చి, ) ఎవరైనా ఆ సుమన్ గారి ఫోటో పెట్టి పుణ్యం కట్టుకున్డురూ వీరెవరో కొంత తెలుసు కుంటాను. ఈ ప్రశ్న ఇంతకు మునుపు మరో బ్లాగులో కూడా అడిగాను. ఫన్కాలు అంటారు గాని ఎవరూ వారి ఫోటో ని నా కళ్ళకి చూపించడం లేదు సుమండీ, అదేమీ చోద్యమో ! ఈ సుమన్ గారి ఫన్కాలు 'క్లోసేడ్' గేటెడ్ కమ్మ్యూనిటీ ఫన్కాలు గా ఉన్న్నారు !!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. meeru anta badha padalsina avasaram ledu...thatstelugu lo news pekaram, ETV telugu and ERV 2 are with Ramoji rao. (25% share to TV18).so mee Suman ekkadiki podu..

    రిప్లయితొలగించండి
  5. Bagundhi tapa... Ayina 25% share e kada telugu channel lo Suman Babu meda benga petukoku....

    రిప్లయితొలగించండి
  6. mee varnana adbhutam, amogham. kaakapote idi suman babu serials choosi nerchukunna kala kaadu ani naa abhipraayam.

    రిప్లయితొలగించండి
  7. నేను ఈటివి చూడడం ఎప్పుడో మానేశాను. నేను చూసేది HMTV ఒక్కటే. ఆ సుత్తిగానికి 25% షేర్ ఉంటే ఏమిటి, 75% షేర్ ఉంటే ఏమిటి?

    రిప్లయితొలగించండి
  8. our Suman Babu is common man's Hero for every month he release his movie at free of cost. yesterday i also heard that sad news :-(

    రిప్లయితొలగించండి
  9. ha ha ha ! True. Unexpected beginning of 2012 for Suman Fans. Actually everyone is prepared for another 54 telefilms this year.

    btw

    జిలేబీ గారూ...

    ఎంత అవమానము ? సుమన్ ఎవరో మీకు తెలీదా.. ఫొటో ఫొటో అంటారు... !? ఈ అవమానాన్ని సుమన్ ఎలా భరిస్తారు ? ఆయన అభిమాన్లమైన మేము ఎలా సహిస్తాము ? అస్సలెందుకీ భూమి వుంది ? ఆకాశం వుంది ? సాటిలైట్ టీ వీ వుంది ? ఇందుకేనా ? #$#$@&^&$.....

    రిప్లయితొలగించండి
  10. సుమన్ గాడు తీసిన సీరియల్స్‌లో కొన్నిటిని మాత్రమే చూశాను. వాటిలో లేడీ డిటెక్టివ్ ఒకటి. జురాన్ బ్లాగ్‌లో సౌమ్య నాకు ఓ ప్రశ్న అడిగింది "బాబీ, జూబాబీలు నీకు గుర్తున్నారంటే నువ్వు ఆ సీరియల్‌ని ఎంత సీరియస్‌గా చూశావో" అని. సుమన్ గాడి సీరియల్స్ గురించి చెపితే ఎవరైనా ఆ ప్రశ్నలే అడుగుతారు.

    రిప్లయితొలగించండి
  11. వంద శతకాలతో ముప్పయి ఏళ్ళు సచిన్ బాబు ఏలాలని, వెయ్యి టెలి ఫిల్ములతో యాభయి ఏళ్ళు సుమన్ బాబు అభిమానులను ఊరించాలని కోరుకుందాం.

    One condition though: spare me from this tamasha. I will safely stick to Cartoon Network, National Geography & History channels till these worthies get tired and retire.

    రిప్లయితొలగించండి
  12. సుమన్ నిర్మించిన పద్మవ్యూహం సీరియల్ చూశారా? తాతమనవడ్ని చెత్తకుండీలో విడిచిపెట్టేటప్పుడు పక్కన పెట్టిన పర్స్ పాతికేళ్ళ తరువాత కూడా చిరిగిపోకుండా, నలిగిపోకుండా కొత్త పర్స్‌లా ఉంటుంది. ఆ పర్స్ ఆధారంగానే తాత తన మనవడ్ని గుర్తు పడతాడు.

    రిప్లయితొలగించండి
  13. సుమన్ రకరకాల సినిమాలు కాపీకొట్టి, అవన్నీ కలిపి రుబ్బి సీరియల్స్ నిర్మించేవాడు. వాడికి అంత కంటే ఏమీ చేతకాదు.

    రిప్లయితొలగించండి
  14. "నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి" అని నేను చెప్పకపోయినా నన్ను తలుచుకున్నందుకు సంతోషం... అదీ మన సుమనుడి ప్రస్తావనలో. ఓహ్.. ముగాంబో ఖుష్ హువా!

    ఇంతకీ ఈ టీవి ఉండేనా? ఊడేనా?

    రిప్లయితొలగించండి
  15. ఈటివిలో రామోజీరావు తన షేర్ ఉంచుకున్నాడు. ఈ లింక్ చదవండి: http://apmediakaburlu.blogspot.com/2012/01/2100-ee-tv.html

    రిప్లయితొలగించండి
  16. అయినా రామోజీరావు పుట్టుకతో డబ్బున్నవాడు కాదులే. అతను పుట్టింది గుడివాడలోని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో. 1975లో విశాఖపట్నంలో వ్యాపారం పెట్టి ఏదో సుడి తిరిగి డబ్బులు సంపాదించాడు. వ్యాపార శతృవులతో పోటీ పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. రేపు జగన్ కూడా ఇలాగే అవుతాడు.

    రిప్లయితొలగించండి
  17. Ushodaya Enterprises officially announced that they will have 51% share in both of the telugu channels. http://www.eenadu.net/Business/Businessinner.aspx?qry=bussi2

    రిప్లయితొలగించండి
  18. శివ భాధపదకు రా....
    అర చెయీ అడ్డు పెట్టి సుర్యుడు ని ఆపలేరు."మా టివి" పెట్టి మీరు "ఈ టీవి" ని ఆపలేరు. మా అన్న

    సూపర్ మెగా పవర్ స్తైలిష్ యంగ్ రెబల్ టైగర్ " సుమన్ బాబు జిందాబాద్ --మల్లి

    రిప్లయితొలగించండి
  19. సుమన్‌గాడి సీరియళ్ళు కంటే ప్రభాకర్‌గాడి సీరియళ్ళు అద్వాన్నంగా ఉంటాయి. ముద్దుబిడ్డ సీరియల్ చూడోద్దు, మీరు కుటుంబ విలువలని నాశనం చేసే ఆ సీరియళ్ళు చూస్తే నేను భరించలేను అని నేను మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ ఆ సీరియల్‌కి మా ఇంట్లోవాళ్ళు చూడకుండా అడ్డుకున్నాను. అంత అసహ్యకరమైన సీరియల్ అది.

    రిప్లయితొలగించండి