7, అక్టోబర్ 2012, ఆదివారం

మద్రాసు పట్టణం -1

ఇంటర్వ్యూలో గట్టెక్కి,కంపెనీ నుండి పిలుపు వచ్చేదాకా ప్రశాంతంగా పురానాపుల్ లో పదవతరగతి పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న రోజులలో,ఉన్నపళంగా తట్టా,బుట్టా సర్దుకుని జులై 27 న మద్రాసులో ఉన్న తమ శాఖలో చేరమని ఒక మెయిల్ వచ్చింది.ఎపుడు?జులై 23 న.కంపెనీ వారిచ్చిన ఆఫర్లెటర్తో పాటు నేను బ్రతికే ఉన్నట్టు,నేను నేనే అని ఘనత వహించిన గవర్నమెంట్ వారిచ్చిన గుర్తింపు పత్రాలు తీసుకురావాలని ఆజ్ఞ.

నా దగ్గర అప్పటికి ఓటరు గుర్తింపు కార్డు తప్ప ఇంకే అధికారిక గుర్తిపు కార్డ్లూ లేవు.పాస్పోర్టుకి,పాన్ కార్డుకీ,లైసెన్సుకీ,ఇంకా సవాలక్ష కి అప్ప్లై చేసాను కానీ ఒక్కటీ రాలేదు.మెయిల్ చూసుకోగానే ఇంటికి ఫోన్ చేసి విషయం చేరవేసి ఇక తరువాతి రోజు అబిడ్సులో ఉన్న ఆఫీస్ కి వెళ్ళాను పాన్ కార్డ్ కోసం విచారించడానికి.ఈ ప్రక్రియలో ఒక చోట ఇడ్లీ తిని 100 రూపాయల నోట్ ఇచ్చి చిల్లర తీసుకొవడం మరిచిపోయాను.ఈ విషయం నాకు తిరిగి వచ్చేటపుడు ఒక దగ్గర టీ తాగున్నపుడు గుర్తు వచ్చింది.ఆ బాధలో అతనికి టీ డబ్బులు ఇవ్వడం కూడా మరిచిపోయాను.....:).ఇక తరువాతి రోజు ఇంటికి ప్రయాణం.మద్రాసు కి ముగ్గురికి టికెట్ బుక్ చేయాల్సిన బాధ్యత మరో మిత్రుడిది.

ఇంటి దగ్గర మూటా,ముల్లె,పులొహోరా,పెసర గారెలు అన్నీ సర్దుకుని ఇహనో,ఇపుడో బయలుజేరతాము తయారయి ఉండమని ఒక మిత్రుడికి ఫోన్ చేస్తే,ఒరే వెంగళప్పా...!,మనం బయలుజేరల్సింది రేపు రా అని చెప్పాడు...:).మొదటిలోనే మొట్టికాయ.ఇంట్లో వాళ్ళ చుర చుర చూపుల్ని తప్పించుకుని తరువాతి రోజు యధాప్రకారం మళ్ళీ అన్ని సర్దుకుని బయలుజేరాం మద్రాసుకి, నల్గొండలో చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి.

*************************************************************************************

పూజ్యం....చెన్నైలో దిగగానే నేర్చుకున్న తొలి తమిళ పదం.సెంట్రల్ లో దిగగానే ఇంకేదో ట్రైన్ నెంబర్ అనౌన్స్ చేస్తున్నారు.అది విని పట్టేసా....:).అలా దిగీ దిగగానే ఒక తమిళ పదం నేర్చుకున్నానన్న గర్వంతో ఛాతీ ఉప్పొంగగా,మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మిత్రుని అడుగుజాడల్లో నడుస్తూ సెంట్రల్ నుండి బ్రాడ్వే కి చేరుకుని,పెరుంగుడికి ప్రయాణమయ్యం 21H లో.

*************************************************************************************

"ఎహే...!మామూలుగా ఉంటుంది అనుకుంటున్నావా?ఫైవ్ స్టార్ స్థాయిలో ఉంటుంది.మా కంపెని అంటే ఏమనుకుంటున్నావ్?(అప్పటికి ఇంకా చేరనేలేదు,అప్పుడే మా కంపెనీ అయింది:)) ఎయిర్కండీషండ్ గదులు,దూదుల్లాంటి పరుపులు,మల్లెపూవుల్లాంటి దుప్పట్లు,మందీ మార్బలం,రక్షణకు కాల్బలం"ఇవీ మా కంపెనీ మాకివ్వబొయే వసతి గురించి మా ఇంట్లో నేను కోసిన కోతలు.తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి, అప్పటికే వచ్చి గదులు ఖాళీ లేక శ్రీలంక శరణార్థులలా మరో రెండు తెలుగు ముఖాలు,ముఖాలు వేళాడేసుకుని ఉన్నాయి.వాటికి తోడుగా మా మూడు తెల్ల ముఖాలని తగించాము.అక్కడ అంతా గందరగోళం.ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు లాబీయింగ్లు.We want room అని బెదిరించే బెంగులూరు భామలు కొందరైతే,We need to report there by 8'O clock అని అర్థించే బాపు బొమ్మలు కొందరు.

ఏది ఐతే అదే ఔతుంది అని సిగ్గులేకుండా చోద్యం చూస్తున్నది మాత్రం మేమే.మా కంపేనీలో అంతకుముందెన్నడూ ఒక్కసారే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్దులు చేరకపోవడం వలన కలిగిన అనుభవలేమి వలన జరిగిన పొరఫాటది.

ఒక గంట గడిచాక ఆ హోటల్ ఓనర్,Temporaryగా ఆ రోజు వరకు సర్దుకోమని ఒక గది కి పంపించాడు మమ్మల్ని.మొత్తం 6 గురం ఉన్నాం అందులో.స్నానపానాదులు ముగించి,అల్పాహారం లాంటివేమీ లేకుండానే బయలుజేరాం ఆఫీసుకి.

joining formalities అన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి రూం కి వఛ్ఛే సరికే అక్కడ దృశ్యం చూసి మా కళ్ళు బైర్లు కమ్మాయి, నోట మాట పడిపోయింది.....

(సశేషం)

10, మే 2012, గురువారం

ఒక ఆటో డ్రైవర్ కథ....

పరాకుగా ఆఫీస్ నుండి బయటకి వస్తూ బయట బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన పాంప్లేట్ ని తిరగేస్తూ అక్కడే ఆగి ఉన్న ఆటోలో డ్రైవర్ సీట్ పక్కన కూచున్నాను.ఇంకో ఇద్దరు ఎక్కిన తరువాత మెల్లగా స్టార్ట్ చేసి నడుపుతూ రెండు చేతులతోనూ ఆ పాంప్లేట్ ని పట్టుకుని చదువుతున్న నన్ను చూసి,సార్, లోన్ తీసుకోవాలంటే ముందు మీరు ప్రాణాలతో ఉండాలి కదా ఆ రాడ్ పట్టుకుని కూర్చోండి అన్నాడు.అవాక్కయిపొయి అతనివైఫు అలా చూసాను.ఇంతలో పేపాల్ కంపనీ ముందు ఒక ఉత్తర భారతీయుడు ఎక్కాడు, చక్కని ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళాలో కనుక్కున్నాడు.అంతటితో ఆగలేదు, ఆ ఆటొ ఎక్కిన వాళ్ళలో ఎక్కువ మంది ఉత్తర భారతీయులే కావడంతో హిందీ పాటలు పెట్టాడు.

అపుడు తిరిగి చూసాను, వెనక సీట్ వైపు ఎందుకో అనుమానం వచ్చి.అదే,సరిగ్గా అదే ఆటో.ఎపుడొ ఒకసారి అసెండాస్ కి వెల్తున్నపుడు ఎక్కాను అదే ఆటో.ఇంతకీ ఆ ఆటొ ప్రత్యేకత అంటే, వెనక సీట్ పక్కన అన్ని ప్రముఖ ఆంగ్ల మేగజీన్లు ఉన్నాయి ఆటొ ఎక్కిన వాళ్ళు మార్గ మధ్యంలో చదువుకోడానికి వీలుగాను,అంతే కాదు,తనే మొబైల్స్ కి,డిటిఎచ్ సర్వీస్ లకి ఆటొలో నుండే రీచార్జ్ కూడా చేస్తాడు.అంతేకాక మెదడు కి పదును పెట్టుకోడానికి గాను అందులోనే ఒక చిన్న ప్రశ్నాపత్రం జనరల్ నాలెడ్జ్ మీద.ప్రతి వారానికి ఆ ప్రశ్నా పత్రం మారుతూ ఉంటుంది.మనం సమాధానాలు వ్రాసి దాని మీద మన పోన్ నంబర్ రాయాలి.సరి అయిన సమాధానాలు వ్రాసిన వారి నుండి ఒకరిని ప్రతీ వారం లక్కీ డ్రా ద్వారా ఎన్నుకుని బహుమానం ప్రకటిస్తారు.

ఇంతా చూసాక కుతూహలం కొద్దీ అడిగాను తనని వివరాలన్నీ.నేను మొదట ఇవన్నీ ఏదైనా ఒక సంస్థ సౌజన్యంతో చేస్తున్నాడేమో అనుకున్నాను.కానీ, అతనితో మాట్లాడిన తరువాత తెలిసింది ఏమిటి అంటే,ఇవన్నీ తన సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేసాడు అని.ఎందుకు ఇవన్నీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమా అని అడిగాను.కాదు , కస్టమర్ సాటిస్ఫై అవడానికంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి సార్ అని చెప్పాడు.దాదాపు నెలకు ఒక 1500 ఖర్చు పెట్టి అన్ని మేగజీన్లు కొంటాడు అంట.ప్రతీది అప్డేటెడ్ గా ఉంచుతాడు అంట.ఈ మధ్యనే 30 వేలు పెట్టి ఒక ల్యాప్టాప్ కి ఆర్డర్ ఇచ్చాడంత,ఎందుకూ అంటే ఆటో ఎక్కిన వాళ్ళు ఇంటికి వెళ్ళేలోఫు ఏదైన మెయిల్స్ చెక్ చేసుకోడానికి, క్రికెట్ స్కోర్ తెలుసుకోడానికి అని చెఫ్ఫాడు.

ఇంతేకాదు, రేపు మదర్స్ డే అని చెప్పాడు. ప్రతీ మదర్స్ డే కి 30 సంవత్సారాలు దాటిన మహిళలందరికీ తనా ఆటోలో ప్రయాణం ఉచితం అనీ, అలాగే ప్రతి ఫాదర్స్ డే కి 30 సంవత్సారాలు దాటిన పురుషులకి ఉచితం అనీ,బాలల దినోత్సవం నాడు 14 సంవత్సరాల లోపు బాల,బాలికలకు, అబ్దుల్ కలాం పుట్టీన రోజు నాడు అందరికీ ఉచితం అనీ గర్భిణీలకు, వృద్ధులకు ప్రతి రోజు ఉచితం అనీ చెప్పాడు.నేను మదర్స్ డే రేపు కాదని ప్రతి సంవత్సరం MAY మొదటి ఆదివారం నాడనీ చెప్పాను.

నాకు భలే ముచ్చట వేసింది,తను ఎంత వరకు చదువుకున్నదీ ఆరా తీస్తే తెలిసింది ఏమిటి అంటే 12 వరకు అని.మరి ఇంత చక్కని ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగితే ఒక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్స్ లో చేరాను అని, అంతేకాక ప్రతి రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుతానని చెప్పాడు.

ఒక మనిషి ప్రేరణ పొందడానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలే చదవక్కర లేదు, మన చుట్టూ ఇలాంటి ఎందరో ఉంతారు.కాస్త కళ్ళు తెరిచి చూడాలి అంతే.ఇంతా చేసి ఇతనికి వీటి వల్ల ఆదాయం పెద్దగా పెరిగిందేమీ లేదట.నిజమే, అతను ఆటో నడిపేది చెన్నై లోని OMR రోడ్ మీద.అక్కడ లెక్కకు మిక్కిలి ఆటోలు,కచ్చితంగా ఇతని ఆటో కావాని ఎక్కేవారి సంఖ్య చాలా తక్కువ.కానీ ఎందుకు ఇది అంతా అంటే ఆత్మ సంతృప్తి కోసం.

అతని పేరు అన్నాదురై, మొబైల్ నంబర్: 9884123413

అతనితో అంత సేపు మాట్లాడి దిగిన తరువాత అతని ఫోటో తీసుకుంటాను అని అడిగాను, దానికి అతను ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే మిగిలిన కస్టమర్లకి ఆలస్యం ఔతుంది సార్ అని.

22, ఏప్రిల్ 2012, ఆదివారం

లైఫ్ బాయ్ ఇక్కడ ఉంది....

తీరికగా వారాంతం కాళ్ళు బార్లాజాపి కూచుని విసుగుపుట్టి స్నానం చేయాలని అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళీన నన్ను ఖాళీ సబ్బుపెట్టె వెక్కిరించింది.అపుడు నెమ్మదిగా నాలిక కరుచుకుని పక్క వీధిలో ఉన్న పచారి కొట్టుకు సబ్బు కొనుక్కుందామని వెళ్ళాను.

అపుడే అక్కడికి ఒక అమ్మాయి ఆకుపచ్చ చుడీదార్లో వచ్చింది.అప్రయత్నంగా నా కళ్ళు అటువైపు ఆకర్షించబడ్డాయి,ఇది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య దీనికి మనమేమీ చేయలేము.కానీ అటు తిరిగిన నన్ను ఆ అమ్మాయి కన్నా ఎక్కువగా ఆకర్షించింది అక్కడ గోడకి ఉన్న ఒక ప్రకటన.అది లైప్ఫ్బాయ్ సబ్బుది.అది చూడగానే నాకు ఒంటికి ఒక్కసారి కూడా లైఫ్బాయ్ సబ్బు రుద్దుకునే భాగ్యం కలగలేదు కదా అనే విషయం గుర్తు వచ్చి ఒకింత చింతించాను.అసలు నాకు ఇంతవరకూ లైఫ్బాయ్ సబ్బు రుద్దుకునే భాగ్యం ఎందుకు కలగలేదూ అంటే కింద పేరా చదవాలి.

కాసేపు ఉండు శివయ్యా...నేను స్నానం చేసి వస్తాను అని మురళి అన్నపుడల్లా నాకు అక్కడే ఉండి మురళి స్నానం చేసేంతవరకూ చూడలని ఉండేది.ఎందుకంటే మురళి వాళ్ళ ఇంట్లో వాడేది లైఫ్బాయ్ సబ్బు మరి. లైఫ్బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని చిన్నపుడు దూరదర్శన్ రోజులలో ఈ లైఫ్బాయ్ సబ్బుకి వఛ్ఛే ప్రకటన అంటే నాకు చచ్చేంత ఇష్టం .ఎర్రగా పెద్దగా ఒక రకమైన వింత వాసనతో ఉండే ఆ సబ్బుని చూస్తే నాకు కూడా ఆ ప్రకటనలో పిల్లాడిలాగా లైఫ్బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని పాటపాడుతూ స్నానం చేయాలని,ఆ పిల్లాడిలాగానే టర్కీ టవల్ కట్టుకుని లైఫ్బాయ్ అని అరుస్తూ ఇంట్లోకి పరిగెట్టాలని భలే ఇదిగా ఉండేది.

దీనికి తోడు మురళి వాళ్ళ ఇంట్లోను, భాస్కర్ అన్న వాళ్ళ ఇంట్లోను లైఫ్బాయ్ సబ్బే వాడేవాళ్ళు.వాళ్ళూ రోజూ స్నానం చేసేటపుడు చక్కగా ఆ ప్రకటనలో వచ్చే పాట పాడుతూ స్నానం చేసి లైఫ్బాయ్ అని అరుస్తూ ఇంటికి బోసి మొలతో పరిగెట్టేవాల్లు.మా ఇంట్లో ఒక టర్కీ టవల్ ఉండేది అది మా నాన్న వాడేవారు.కానీ అది చుట్టుకుని అరవడానికి లైఫ్బాయ్ సబ్బే ఉండేది కాదు.

దీనికి ఇంత గోల ఎందుకు,ఒక సబ్బు కొనుక్కోక పొయావా అని అడగబోతున్నారా?అక్కడే ఉంది అసలైన చిక్కు,మా అమ్మకి లైఫ్బాయ్ సబ్బు అంటే ఒక చీప్ అభిప్రాయం ఉండేది,మా ఇంట్లో ఎపుడు చూసినా లక్స్ సబ్బే తెచ్చేవాళ్ళు.మరీ గొడవ చేసి అడిగినా నెత్తి మీద టెంకె జిల్ల పడేదే కానీ తరువాతి నెల సరుకు చిట్టాలో లైఫ్బాయ్ సబ్బు ఉండేది కాదు.

లక్స్ వాడడానికి నీకు వచ్చిన కష్టమేమిటి అని ఇంకొక ప్రశ్న ఉదయించిందా? ఆ సబ్బుకి వచ్చే ప్రకటన ఎలా ఉండెదంటే మెరిసే చర్మం కోసం లక్స్,నక్షత్రం లాంటి మెరుపు కోసం లక్స్ ఇలా ఉండేవి.నల్లటి నేరేడు కాయలాంటి నా శరీరాన్ని చూసి నక్షత్రంలాంటి మెరుపు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కాక ఆ ప్రకటనలకి ఎపుడూ సినిమావాళ్ళు వచ్చే వాళ్ళు,ఎపుడూ ఒక పిలకాయ వచ్చినట్టు నేను చూడలా.ఇక నేను స్నానం చేస్తూ ఏం పాట పాడుకోవాలి?

ఈ కష్టాలు ఇలా ఉంటే, మేము ఎప్పుడైనా కొట్టుకునే ఆట ఆడుకుంటున్నపుడు(అప్పటిలో దూరదర్శన్లో సినిమాలు చూసి ఆ ఫైటింగులు ప్రాక్టీస్ చేసే వాళ్ళం,తరువాత మా ప్రతిభా పాటవాలు ఒకరి మీద మరొకరు ప్రదర్శించుకునే వాళ్ళం అదే ఈ కొట్టుకునే ఆట) మురళి గాడు వాళ్ళందరూ అరెయ్ నాది లైఫ్బాయ్ సబ్బు రా, నాకేమి కాదు అని పిడి గుద్దులు గుద్దుతూ ఉంటే,నేను అరెయ్ నాది నక్షత్రం లాంటి నిగారింపురా అని బదులు చెప్పలేక ఆ పిడి గుద్దులకి లొంగిపొయేవాడిని :(

ఇలా ప్రతీ కొట్టూకునే ఆటలోనూ ప్రత్యర్థులకు లొంగిపొతూ,టర్కీ టవల్ ఉన్నా కూడా అది వాడలేకపొతున్నాను అనే బాధతో కుంగిపొతూ ఉండగా ఒక రోజు అద్భుతమైన అవిడియా ఒకటి తట్టింది.అప్పటిలో మావి అన్ని పూరిళ్ళూ,ఒక ఇంటికీ ఇంకొక ఇంటికీ మధ్య గోడలు కూడా ఉండేవి కావు.పందులూ,కుక్కలూ అపుడపుడూ పందికొక్కులూ అవి ఇవీ తీసుకుపొతూ ఉండేవి,నేను కూడా సగం అరిగిపోయిన మురళి వాళ్ళ లైఫ్బాయ్ సబ్బుని ఎత్తుకువెళ్తే ఏ పందికొక్కో ఎత్తుకుపొయింది అనుకుంటారు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసాను.

ఒక ప్రణాలిక రచించాను పక్కాగా,శనివారం మధ్యానం ఒకాపూట బడి ఐపొగానే అన్నం తినేసి ఆడుకుంటాను అని తాతయ్యకి చెప్పి, చిన్నగా మురళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం,తరువాత చటుక్కున ఎవరూ చూడకుండా సబ్బుని జేబులో వేసుకోవడం.ప్రణాలిక ప్రకారమే సబ్బుని జేబులో వేసుకున్నాను.తరువాత ఎవరైనా చూసినా ఇది పంది కొక్కు ఎత్తుకు వచ్చింది అనిపించేందుకు గాను దాన్ని కొద్దిగా కొరికి గాట్లు పడేలా చేసాను. ఇంటికి వచ్చాక దాన్ని ఎక్కడ దాచాలా అన్న ప్రశ్న మొదలైంది.ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని వంటింట్లో మా కిరసనాయిలు స్టవ్ వెనక దాచిపెట్టాను, ఆ రాత్రి అంతా తరువాతి రోజు పొద్దున్న ఆరోగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్బాయ్ అని పాటలు పాడుకుంటూ,మా ఆకుపచ్చ టర్కీ టవల్ కట్టుకుని నారింజ చెట్టు కింద నుంచి ఇంట్లోకి పరిగెడుతున్నట్టు ఊహించుకుంటూ మాటి మాటికీ పొద్దునెపుడు ఔతుంది నాన్న అంటూ నస పెడుతూ ఎప్పటికో పడుకున్నాను.

తెల్లారింది,కోడి కూసింది,అమ్మ లేపింది, ఆదరా బాదరగా పళ్ళు తోముకుని, మా నాన్న స్నానం చేసిందాకా ఆగి(టర్కీ టవల్ కోసం) సబ్బుకోసం స్టవ్ వెనక చేయి పెట్టి చూద్దును కదా సబ్బు లేదు.మాయం.ఏమైంది అని ఎవరినైనా అడగడానికి కూడా లేదు.బిందెల వెనకా, తప్పేలాల కిందా వంటిల్లు మొత్తం వెతికి చూసాను,కనపడలేదు.ఇక తప్పేది లేక అడిగాను అమ్మని.మా,మా నిన్న పందికొక్కు ఎత్తుకుపొయిన మురళి వాళ్ళ సబ్బు నాకు దొరికింది మా,నేను తెచ్చి ఇక్కడ పెట్టాను ఏదీ అని. మా అమ్మ నాలుగు తిట్టి ఆ సబ్బు బయట విసిరేసాను అని చెప్పింది,నిజంగా పందికొక్కే తీసుకు వచ్చింది అనుకుని.

నా ఆశల సౌధం కూలిపోయింది,నా ఆరోగ్యానికి ఆ ఆదివారం కూడా రక్షణ లేకుండా పొయింది.ఆ తరువాత మాడిపోయిన మొహం తో, నక్షత్రం లాంటి నిగారింపుతో వెళ్ళాను,ప్రత్యర్ధుల చేతిలో పిడి గుద్దులు తినడానికి.

కొసమెరుపు: మా అమ్మకి లైఫబాయ్ సబ్బు మీద ఇప్పటికీ అభిప్రాయం మారలేదు, ఈ రోజు నేను లైఫ్బాయ్ కొని దానితో స్నానం చేసి మా అమ్మకి చెపితే ఇప్పటికీ అదే మాట అంది,ఆ సబ్బుతోనా ఐతే ఇంకోసారి చేయి స్నానం అని.

3, జనవరి 2012, మంగళవారం

సుమన్ అభిమానులారా రండి!కలిసి చింతిద్దాం.

ఇలా ఔతుందని అనుకోలేదు, అసలు కలలో కూడా ఎపుడూ అనుకోలేదు.

నా మటుకు నేను నా పని చూసుకుని రాత్రి భోజనం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఒక తెలుగు తెలిసిన మిత్రుడు.వచ్చిన వాడు ఊరక ఉండక ఆ పిడుగులాంటి వార్త నా చెవిన వేసాడు.ఆ క్షణం, ఆ వార్త విన్న క్షణం నా కాళ్ళ కింద నేల బీటలు కొట్టింది, నా కళ్ళ నీరు కాలువలు కట్టింది.ఇంకా ఆకాశం కృంగలేదేమి?, జలధులుప్పొంగలేదేమి? ప్రళయం రాలేదేమి?

ఈ టి.వి గ్రూపుని టి.వి.18 గ్రూపు కొన్నదనేది ఆ వార్త,వాడు దాని వెనకాల గల వ్యాపార కోణాలు ఏకరువు పెడుతున్నాడు.కానీ నేను అవేమీ పట్టించుకునే స్థితిలో లేను.అప్పటికే నా మనసు మూగగా రోదించడం మొదలు పెట్టింది.ఆ క్షణం నా మనసుని ముక్కలు చేసిన ఊహ ఒక్కటే.ఇక మన నవరసాల నాయకుడి భీభత్స భయానక రౌద్ర రసాభినయం చూడకుండానే ఆ పరంపర కి అడ్డుకట్ట పడబోతుందా అని. ఇక సుమన్ బాబు ప్రీమియర్ షో లు ఉండవేమో అనే ఆలొచనే నన్ను అధః పాతాళానికి తోసేసింది.(అసలు వాడి బాధ తట్టుకోలేకే రామోజీ రావు ఈ.టి.వి ని అమ్మేసాడని కూడా కూసాడు మా మిత్రుడు,కానీ అలాంటి రసహృదయం లేని వాళ్ళ మాటలు నేను నమ్మను).

అసలు సుమన్ బాబు లేని ఈ.టి.వి ని, సూర్యుడు లేని లోకాన్ని ఊహించగలమా?కొండొక గుజ్జు రూపమున ఆ పళంగా బుల్లితెరని బల్లిలా అంటిపెట్టుకుని ఇంత కాలంగా మనం వద్దుమొర్రో అంటున్నా వినకుండా తన విశ్వరూపంతో వినోదాన్ని పంచిన బాబు దివ్య మంగళ రూపాన్ని ఇక మీదట చూడలేమేమో అన్న ఊహ నాకు కలిగినపుడు నా మనసులో కలిగిన అలజడిని వర్ణించడానికి కాళిదాసు అంతటి వాడికి కూడా ఉపమానం దొరకదు మళ్ళీ సుమన్ బాబే సుమనోహారాలు కొనసాగింపులో నాలుగు కొత్త వర్ణనలు చేయాలి.

ఎన్నని?అసలెన్నని? మన సుమన్ బాబు చేసిన ప్రయోగాలు(కొండకచో అవి మానవ మనుగడకి ప్రమాదాలుగా పరిగణింపబడినాకూడా).ఒకటా రెండా? ఆ చిట్టాకి అంతమెక్కడ?అంతరంగాలు అన్న పేరుతో తరాలు మారినా తరగని ధారావాహికని తీసాడు.ఎండమావులతో ప్రజల చేత కన్నీటీ జళ్ళు కురిపించాడు.కళంకిత బిరుదాంకితుడయాడు.ఇవన్నీ ఒక ఎత్తు.ఈ మధ్య ప్రజల మీద సంధిస్తున్న టెలీఫిల్మాస్త్రాలు ఇంకొకెత్తు. శ్రి కృష్ణ పరమాత్మ రూపం ధరించి జనుల గుండెలు కొల్ల కొట్టినా, డాన్ లా వచ్చి నాన్ స్టాప్ గా బాదినా అది ఆయనకి మాత్రమే సాధ్యమయే విద్య.

ఈ మధ్య మరీ ప్రజలలో ప్రశాంతత ఎక్కువైందని గమనించిన బాబు, నెలకో టెలీఫిలింవేసి లయ కారకుడినని నిరూపించుకున్నాడు.అసలు నేనైతే బాబు ఎప్పటి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ ఉన్న "సందడి" అనే చిత్ర రాజాన్ని జనవరి 1 న వేసి ఈ కొత్త సంవత్సరానికి ఒక అర్థాన్ని, నా జీవితానికి ఒక పరమార్థాన్ని చూపిస్తాడని అనుకున్నాను.కానీ బాబు నన్ను నిరాశ పరిచాడు.ఐతేనేమి?ఇహనో ఇప్పుడో అది ప్రసారమౌతుంది. కానీ ఆ తరువాత?


నా బాధ సరే మన నెమలికన్ను మురళి గారు?ఎప్పటి నుంచో బాబు ఇహనో రేపో ఒక అద్భుత జానపద చిత్రం చేస్తాడని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వారి ఆశ తీరదేమో అని నా కళ్ళు చెమర్చాయి.మరి మన కొత్తావకాయ గారి సంగతి? వారి బాధ వర్ణనాతీతం.

దేవుడా ఏమిటీ అకాల వైపరీత్యం? బహుశా 2012 లో ప్రళయం వచ్చేది ఇందుకేనేమో? బాబు ని చూడ లేని బ్రతుకు వృధా అని ఆ పరమాత్మకి కూడా తెలిసిందేమో.

2, జనవరి 2012, సోమవారం

చలిమంట

పొద్దున్నే లేచి చలికి తట్టుకోలేక చేతులు రాపాడిస్తూ ఆ వేడిని చెంపలకి అద్దుకుని, నోట్లో బ్రష్ వేసుకుని నాన్న కొత్తగా కొనిచ్చిన రబ్బరు చెప్పులు తొడుక్కుని చలికి వణుకుతూ నడుస్తూ మురళి గాడి దగ్గరికి వెళ్తే అప్పటికి వాడు ఇంకా లేవలేదు.వాడిని లేపి అరే పదరా చలిమంట వేసుకుందాము అని చెప్పి కోళ్ళ గంప తీసి చూసే సరికే మేము తెచ్చిపెట్టుకున్న సరంజామా ఏమీ లేదు అక్కడ.

*****************************************************************

అది మామూలు చలిమంట కాదు,మేము ఎంతో కష్టపడి మా వీధిలోకే పెద్ద చలిమంట వేయాలని అనుకున్నాము.
అసలు చలిమంట వేయడమంటే మామూలు విషయం కాదు.ఎన్నెన్ని కావాలని.ముందు రోజు రాత్రి నేను, మురళి గాడూ వీధులన్నీ వెతికి ఎండిపోయిన పుల్లలు,తాటి మట్టలూ,నర్సరీ కి వెళ్ళి అక్కడ ఉన్న ఎండిన వెదురు బొంగులూ,విజ్జమ్మ బడ్డీ కొట్టు దగ్గరా,విజయ్ కొట్టు దగ్గరా కొబ్బరికాయలు అమ్మినపుడు తీసిన పీచు ఇవన్నీ దొరతనంగానే సంపాదించినా దొంగతనం గా సంపాదించల్సినవి అతిముఖ్యమైనవీ ఇంకొన్ని ఉన్నాయి.అవి ఎండు గడ్డి, పిడకలు.ఆ రోజు ఎంత ప్రయత్నించినా ఎండుగడ్డి దొంగిలించలేక పోయాము.ఇంటి పక్కనే గడ్డివాములు ఉన్నాయి కానీ తీసుకొస్తే యశోద ఆంటీ చూడగానే గుర్తుపట్టేస్తుంది.భాస్కర్ అన్నకి(మా కంటే రెండెళ్ళు పెద్ద అంతే) కూడా మాకు ఇవ్వాలనే ఉన్నా ఇవ్వలేడు పాపం తనని కూడా కొడుతుందని భయం.ఇక మిగిలిన పిడకలైనా ఎలాగోలా సంపాదించాలి కదా.మా వీధిలో ఎవరూ పిడకలు చేయరు.ఉన్న పేడ అంతా వాళ్ళు కళ్ళాపి చళ్ళుకోడమో,పక్కింటి వాళ్ళకి కళ్ళపి చళ్ళుకోడానికి ఇవ్వడమో చేస్తారు.మరి ఎలా?పిడకలు కావాలంటే మూడు వీధుల అవతల ఉన్న లింగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.కానీ లింగా భార్య లచ్చిం పిడకలు చేసి అమ్ముతుంది.ఊరికనే ఇవ్వదు అందుకనే దొంగతనం.


గడ్డి ఎలాగో సంపదించలేక పోయాము కదా, ఇక ఖచ్చింతంగా ఎలాగైనా పిడకలు సంపాదించాలి.ఎలాగూ లింగా పాలు పొయడానికి మా ఇంటికి వస్తాడు.ఆ సమయంలో అక్కడికి వెళ్ళి లచ్చిం బర్రెలకి కుడితి పెట్టడానికి ఇంటి వెనక్కి వెళ్ళినపుడు టకా టకా ఒక నాలుగు పెద్ద పిడకలు పీక్కు వచ్చేయడమే.చాలా సుళువు.పధకం ప్రకారం ఆ రోజు సాయంత్రం లింగా వాళ్ళ వీధి దగ్గరే ఆడుకుంటున్నాము.కాసేపు కాగానే లింగా పాల లోటా తీసుకుని బయలుజేరాడు.మేము మెల్లగా మా గోళీల గుండం లింగా వాళ్ళ ఇంటి ఎదురుగా గీసి మళ్ళీ ఆట అక్కడ మొదలు పెట్టాము.లచ్చిం ఎపుడు ఇంటి వెనక్కి పోతుందా అని ఎదురుచూస్తున్నాము.మురళి గాడు చెప్పాడు "శివయ్యా నేను ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటాను నువు వెళ్ళి పిడకలు పీక్కు వచ్చేయి" అని.నేను అలాగే అన్నాను.అవకాశం కోసం చూస్తున్నాము.

కాసేపటి తరువాత లచ్చిం ఇంటి వెనక్కి వెళ్ళింది.ఇక నేను ముందూ వెనక చూడకుండా ఉరుకుతూ వెళ్ళి చేతికి అందిన నాలుగు పిడకలు పీక్కుని వచ్చేసాను.ఇద్దరం ఇక ఆగకుండా పరిగెత్తితే ఇక ఆగింది ఇంటి దగ్గరే.ఎలాగోలా కావల్సినవి సంపాదించాం కాబట్టి అవి రాత్రి మళ్ళీ మంచు పడి తడవకుండా ఒక సిమెంట్ బస్తాలో వేసి మురళి వాళ్ళ కోళ్ళ బుట్టకింద దాచి ఆ రాత్రి వెళ్ళి పడుకున్నాము.

ఇపుడు పొద్దున్న చూసేసరికి ఏమీ లేవు. అంత కష్టపడి సంపాదించిన పీచు,తాటి మట్టలు, ఎంతొ కష్టపడి దొంగిలించిన పిడకలు అన్నీ మాయం. అటు, ఇటు వెతకడం మొదలు పెట్టాం.ఎక్కడా లేవు.నాకు మురళి మీద కోపం వచ్చింది.అరే పెట్టింది మీ కోళ్ళ గంప కిందనే,ఎక్కడికి పొతాయిరా అని అడిగాను.వాడు బిక్క మొగం వేసి నిజంగా నాకు తెలీదురా అన్నాడు.ఇక చేసేదేమీ లేక మా ఆశలన్ని ఆవిరి ఐపొయాని ఉసూరు మంటూ వెనక్కి వెళ్తుండగా నరేష్ గాడు ఉరికి వచ్చి చెప్పాడు.అరెయ్ ఆ శేఖరన్న మీ కోళ్ళ గంప కింద ఉన్న మూట తీసుకు వెళ్ళీ ఆ రాముగాడికిచ్చాడు రా అని.మేము పరుగు పరుగున వెళ్ళే సరికి వాళ్ళు మా సామానుతో అప్పటికే చలిమంట వెలిగించేసారు.మాకు పిచ్చి కోపం వచ్చింది. మురళి గాడు పక్కనే ఉన్న నీళ్ళ గాబులొంచి తపేళాతో నీళ్ళు తీసుకుని ఒక్కసారి ఆ మంట మీద గుమ్మరించాడు.అంతే రాముగాడు మురళి మీద కలబడ్డాడు.నేను వెళ్ళి వాడి మీద పడ్డాను.అలా ఒకరిమీద ఒకరు కలబడుతూ ఉన్నది చూసి రాము వాళ్ళ అమ్మ ఇంట్లోంచి పరుగు పరుగున బయటకి వచ్చి అందరి మీదా కేకలేసి రాము గాడిని మా నుంచి విడిపించి ఏమైందని అడిగింది,నేను రొప్పుతూ మేము చలిమంట కోసం తెచ్చుకున్న సామనంతా దొబ్బేసాడు వీడు అని చెప్పాను కసిగా పగిలిన పెదం మీద రక్తం తుడుచుకుంటూ.దానికి శేఖరన్న ఏదో కష్టపడి సంపాదించినట్టు చెపుతారేం? లచ్చిం వాళ్ళ ఇంట్లోంచి ఎత్తుకొచ్చిన పిడకలేగా అవి, నేను చూసాను, లచ్చిం కి కూడా చెప్పాను.అవి నన్ను తీసుకు రమ్మంది, నేనే రాత్రి తీసుకు వెళ్ళి ఇచ్చాను మూట.పిడకలు తీసుకుని మూట నాకు ఇచ్చేసింది అని చెప్పాడు.

ఇక చేసేదేమీ లేక వెనక్కి కాళ్ళీడ్చుకుంటూ తిరిగివస్తుంటే భాస్కర్ అన్న కలిసాడు.అప్పుడే పేపర్ వేసి తిరిగి వస్తున్నాడు.ఏమైందని అడిగాడు జరిగిందంతా చెప్పాము.వీధిమొత్తానికి పెద్ద చలిమంట వేద్దామంటె ఇలా అయింది అన్నా అని ఏడుస్తూ.దానికి అన్న మరేం పర్లేదు నేనున్నాను అని చెప్పి,మనం వాళ్ళ కంటె పెద్ద మంట ఇపుడే వేద్దాం అని చెప్పి మమ్మల్ని ఎంకులు వాళ్ళ కూలిపొయిన తాటాకు పాకకి సైకిలు మీద తీసుకు వెళ్ళి ఇంటి కప్పుకి లోపలి వైపు ఉన్న తాటాకు లు పీకమని చెప్పి ఎటో వెళ్ళి 10 నిముషాలలో ఒక అర బస్తా కొబ్బరి పీచు తెచ్చాడు.అవి వెంకటేశ్వర స్వామి గుడిలోంచి అనుకుంటా తెచ్చింది.పూజారి గారింటికి కూడా భాస్కర్ అన్నే పేపర్ వేసేది మరి.మేము అలా తెచ్చిన తాటాకులు, కొబ్బరి టెంకెలు,పీచు సైకిలు మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళాము.భాస్కర్ అన్న వాళ్ళ ఇంటి వెనక దొడ్లోంచి ఒక గడ్డి మోపు కూడా పట్టుకొచ్చాడు.

అన్నీ సిద్ధం, మా చలిమంటకి.అందరినీ పిలిచాము,తాయారు అంకుల్నీ, ఎలిసెమ్మ ఆంటీనీ,దేవకి ఆంటీని,ఇంటర్ చదూతున్న శ్రీధర్ అన్ననీ,గోపాల్ గాడిని, వాళ్ళ నాన్ననీ,మా అమ్మా నాన్ననీ,తాతయ్యనీ అందరినీ పిలిచి వెలిగించాము.చలిమంట. మా వీధిలోకే పెద్ద చలిమంట.దాదాపు అరగంట పైన వెలిగిన మంట.


అంతా అయిపొయిందనుకున్నాము కానీ అవలే, తరువాత పాలు పొయాడానికి వచ్చిన లింగా మా అమ్మకి చెప్పేసాడు మేము పిడకలు దొంగిలించిన సంగతి.యశోదా ఆంటీ కి భాస్కర్ అన్న గడ్డిమోపు తీసిన సంగతి కూడా తెలిసింది.మా ఇద్దరికీ వీపులు వాచాయి.మాకు తోడుగా ఉన్నందుకు మురళి గాడికి కూడా తగుమాత్రంగా పడ్డాయి.ఐతేనేమి మా వీధిలోకే పెద్ద చలిమంట వేసాము.ఆ తరువాత అంత మంట మళ్ళీ మా పిలకాయల గ్యాంగులో ఎవరూ వేయలేదు.

20, జూన్ 2011, సోమవారం

ఉద్యోగం వైపు పయనం

రాత్రి సప్పర్ బెల్ కోసం, సాయంత్రం టీ బ్రేక్ నుంచి ఆత్రంగా ఎదురు చూసీ,చూసీ అది కొట్టగానే కిందకి ఒక్క ఉదుటున పరిగెత్తిన నన్ను అక్కడి పాచిపొయిన పులిహార కన్నా కూడా ఎక్కువ ఆకర్షించింది ఏమిటి అంటే పక్కన నోటీస్ బోర్డ్ మీద అంటించి ఉన్న ఒక ప్రకటన.పచ్చని బేక్ గ్రౌండ్ మీద ఎర్రటి అక్షరాలు.పసుపు,కుంకుమ కలిసినట్టు. ఆహా, సెంటిమెంట్ కూడా బాగానే కలిసింది.అర్థవంతంగా కూడా ఉంది.ఏమిటి దాని అర్థం అనే కదా?చెపుతాను.రేపు మీ కాలేజ్ కి ఫలానా జెంప్యాక్ట్ అనె కంపెనీ ఒకటి ఇంటర్యూ చేయడానికి వస్తుంది అని దాని సారాంశం.అపుడు నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం. మీరు చదివింది కరక్టే.నా మొదటి ఇంటర్వ్యూ నేను ఇంటర్మీడియట్ లో ఉండగానే జరిగింది.


ముందు రోజు సన్నాహాలు మొదలు పెట్టాను,ముందుగా, అడిగే ప్రశ్నల జాబితా ఒకటి తయారు చేసుకున్నన్ను.మొదటి ప్రశ్న,మీరు ఊహించిందే "టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్".అడిగే వాడిని ఇంప్రెస్ చేయాల్సింది ఇక్కడే.మన గురించి చెపితే వాడు ఎలా ఇంప్రెస్ అవుతాడు? అందుకే రెండు రెళ్ళు ఆరు గౌతం గారిని ఆదర్శం గా తీసుకుని, మా క్లాస్ లొ ఉన్న ప్రతి ఒక్కడి దగ్గరి నుంచి ఒకొక్క లక్షణం అరువు తెచ్చుకుని పన్నెండు పేజీలకు తక్కువ కాకుండా సమాధానం తయారు చేసుకున్నాను.

ఇక ఇంటర్వ్యూ రోజు ప్రహసనం, ఉదయాన్నే లేచి, అపుడె వచ్చిన కోర మీసాన్ని, చిరు గడ్డాన్ని నిర్దాక్షిన్యంగా బ్లేడ్కి బలి చేసి,తల స్నానం చేసి,లక్ష్మీ అష్టోత్తరం చదివి,నుదుటను విభూది రేఖను దిద్ది, ముఖానికి ఒకింత పౌడరు అద్ది బయలుజేరాను కాలేజీ బస్ లో. మొదట రెజిస్ట్రేషను గట్రా,గట్రా అయాక మమ్మల్ని ఒక గదిలోకి తోలారు.ఒక అరగంట తరువాత జుట్టు సగానికి కత్తిరించుకున్న ఒక అమ్మాయి వచ్చింది మా గదిలోకి.పేరు శృతి. తన వివరాలు అవి గట్రా చెప్పాక మొదలు పెట్టింది ఇంటర్యూ.అందరికీ ఒకటే ప్రశ్న.”టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్?”. ఆందరూ ఏదో నోటికొచ్చింది చెపుతున్నారు. నా వంతు రానే వచ్చింది.
అసలే రంగంలోకి ఎపుడు దిగుదామా అని ఎదురు చూస్తున్నామాయే. ఇక ఆగుతానా? వదిలా అమ్ములపొదిలో నుంది ఒక వాగ్బాణం. చెప్పుకుంటూ పోతున్నాను. నా పేరు,ఊరూ చదివిన బడి గురించి,వచ్చిన మార్కుల గురించి.నచ్చిన నటుడి గురించి దేనిని వదలలేదు ఈ భూమండలం మీద.

కళ్ళు మూసుకుని అంతా కక్కేసాక , కళ్ళు తెరిచి చూసాను.క్లాస్ మొత్తం డంగై పోయి చూస్తున్నారు నా వంక,శృతి కి మతి తప్పి గిల,గిల కొట్టుకుంటుంది.నీళ్ళు చల్లి లేపాక కోలుకుని, మిగిలిన వాళ్ళని కూడా అదె ప్రశ్న అడిగి వెళ్ళే ముందు మీ క్లాస్ లో ఎవరూ సెలక్ట్ అవలేదు అని చెప్పి వెళ్ళే ముందు నన్ను బయటికి పిలిచింది.ఇక, క్లాస్ లో గుసగుసలు మొదలయ్యాయి.అయ్యాడ్రా, విస్సు గాడు సెలెక్ట్ అయిపోయాడు.డిసైడ్ అయిపోయారు మా వాళ్ళు.నేను కూడా అనుకున్నాను, మొదటి జీతంతో ఏం చేయాలో ప్లాన్ కూడా వేసుకున్నాను. బయటికి వెళ్ళగానే,శృతి చెప్పిన విషయం ఏమిటి అంటే, మీ గదిలో ఉన్న మెటీరియల్ అంతా కింద ఆఫీస్ లో అప్పగించి రా అని. నేను ఉసూరు మంటూ వెనక్కి తిరిగి గదిలోకి రాగానే, అందరూ చుట్టుముట్టారు. ఛెప్పాను, సెలెక్ట్ అవలేదు రా అని, నమ్మలేదు. వాళ్ళ అనుమానానికి, ఆజ్యం పోసిన మరొక విషయం ఏమిటి అంటే, నేను ఆ మాట చెప్పి వెంటనే ఆ సరంజామా అంతా తీసుకుని, కింద ఆఫీస్ కి వెల్లడం. ఇక అందరూ, నేను సెలెక్ట్ అయి కూడా వాళ్ళకి విషయం చెప్పడం లేదేమో అని అనుమానించడం మొదలు పెట్టారు.రెండవ రౌండ్ జరిగే రూంకి వెళ్ళకుండా, మళ్ళీ అదే బస్ లో వాళ్ళతో పాటే తిరుగు ప్రయాణం కట్టినప్పుడు కానీ నమ్మలేదు. అలా ముగిసింది నా మొదటి ఇంటర్వ్యూ
రెండవది, నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఉండగా జరిగింది.డాటా పాయింట్ అని ఒక కంపెనీ వచ్చింది, మిర్యాలగూడ కి.అక్కడ మొదటి రౌండ్ దాటి, జి.డి లో దెబ్బ తిన్నాను.నేను, జె.కె.సి లొ మెంబర్ని కాకపోవడం వల్ల నాకు వాళ్ళు నిర్వహించిన ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం పోయింది.

ఇలా నిరాశ, నిస్పృహ ల మధ్యనే కాలాం గడిచి ఇంజనీరింగ్ అయిపోయింది.అలా, కాలం గడుస్తుండగా ఒక సారి ఎదో కన్సల్టన్సీ ద్వారా పొలారిస్ డ్రైవ్ కి కాల్ వచ్చింది.వ్రాత పరీక్ష గట్టెక్కాను, జి.డి కూడా గట్టేక్కాను ఆశ్చర్యం గా.రేపు టెక్నికల్ కి అటెండ్ అవమని చెప్పారు నిర్వాహకులు.నేను అసలు ఆరోజు వ్రాత పరీక్ష ఒక్కటె ఉంటుందనుకున్నాను, కానీ గ్రూప్ డిస్కషనే ఒక షాక్ నాకు, రేపు టెక్నికల్ అనగానే నా పని అయిపోయింది అనుకున్నాను.ఏది అయితే అది అవుతుందని అటెండ్ అయాను.

ఇంటర్వ్యూయర్ వెళ్ళగానే కుశల ప్రశ్నలు అడిగాడు. ఆహా, ఎంత మంచివాడు.మా నాన్న ఏమి చేస్తాడు ఎక్కడ చేస్తాడు అడిగి మరీ తెలుసుకున్నాడు.తరువాత మొదలయింది అసలు పరీక్ష. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటని అడిగాడు? నేను జావా అని చెఫ్ఫాను. లాంగ్వేజ్ కాదు, కోర్ ఏదైనా చెప్పమని అడిగాడు.నాలుగేళ్ళపాటు చదివిన ఇంజనీరింగ్ లో, ఒక కోర్ సబ్జెక్ట్ కూడా నాకు గుర్తు రాలేదు సమయానికి. అటు,ఇటు బిత్తర చూపులు చూస్తుంటె, అతని వెనక గోడకి అంటించి ఉంది,ఒక పోస్టర్.పోలారిస్ గురించి. ఆపరేషన్స్ ఇన్ మోర్ తాన్ సం కంట్రీస్ అని.అది చూడగానే చప్పున ఆపరేటిం సిస్టంస్ అని చెప్పేసాను. వెంటనే యూనిక్స్ ఆపరేతింగ్ సిస్టం స్ట్రక్చర్ గీయమన్నాడు. ఛచ్చింది గొర్రె. గుర్తు లేదు.ఏదో,ఒక కోడిగుడ్డూ, దానిలొ పచ్చసొన, ఒక పక్కన గీసి చూపెట్టాను. ఛాలా మర్యాదగా బయటికి వేలు చూపించాడు.సిగ్గనిపించింది నాకే. భయం బాధ అన్నీ కలిసిన విచిత్రమైన ఫీలింగ్. దానిని రెట్టిపు చేస్తూ, నా ఇంటర్మీడియట్ స్నేహితులు అందరూ నేను, ఇంఫీ కి సెలెక్ట్ అయ్యాను, నేను టాటా కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పేవాళ్ళు.వచ్చిన అవకాశం పోగొట్టుకున్నాను.మిగిలిన వాళ్ళ కంటే నాకు తక్కువ అవకాశాలు వస్తాయని తెలుసు.నేను జె.కె.సి సభ్యుడిని కాదు.

ఇలా నిస్సారంగా రోజులు గడుపుతున్న సమయంలో ఒక మెసేజ్. ఫలానా కాలేజ్ లో, ఫలానా కంపనీ డ్రైవ్ ఉంది అని.తెలియగానే చేసిన మొదటి పని, ఆపరేటింగ్ సిస్టంస్ బుక్ దొరకబుచ్చుకుని, ముఖ్యమైన విషయాలు మళ్ళి ఒకసారి చదువుకున్నాను.అలానే నెట్వర్క్స్,అన్ని లాంగ్వేజెస్ కూడా.ఫర్వాలెదు అనిపించాక, అపుడు వెళ్ళి అప్ప్లై చేసాను. హాల్ టికెట్ కూడా అందరికీ రాలెదు.కొందరికే వచ్చింది.ఆ కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను. అపుడె ఒక రౌండ్ దాటిన ఫీలింగ్.

ఆ రోజు రానే వచ్చింది, వ్రాత పరీక్ష గట్టెక్కాను. తరువాత జి.డి. 15 మంది ఒక గ్రూప్ లో.ఒకరిని,ఒకరు కొట్టుకుంటున్నారు.నాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు.అది, వాళ్ళ తప్పు కాదు.ఖచ్చితంగా నా అసమర్ధతే.అయిపోయింది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ వ్యర్థం అయిపోయింది.సరిగా, అపుడె,ఒక గొంతు. స్టాప్ అని.తల ఎత్తి చూసాను. ఎవరా అని? జి.డి, కండక్ట్ చేస్తున్న అతను.ఇది డిస్కషన్ లా లేదు.మీరు అందరూ డిస్క్వాలిఫయిడ్ .అంతే, ఎవరూ మాట్లాడలేదు.నిశ్శంబ్దం.కాసేపటి తరువాత, ఒక అమ్మాయి అందరి తరపునా తనే సారీ చెప్పింది. అపుడు తను, ఇలా కాదు.మీ అందరికీ తలా ఒక నిముషం ఇస్తాను, ఆ నిముషం లో మీరు ఏం చెప్పలనుకుంటున్నారో చెప్పేయండి అన్నాడు. నాకు ప్రాణం లేచి వచ్చింది. చెప్పాను. రేపటికి టెక్నికల్ కి రమ్మని అన్నారు.


ఆ రాత్రి వర్షం లో.స్నేహితుడి రూంకి చేరె సరికే 12 దాటింది. ఒక రెండు గంటలు పడుకుని, తరువాత లేచి మళ్ళి ఒకసారి చూసుకున్నాను ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్.ఎక్కడొ చదివాను లింక్డ్ లిస్ట్ మీద తప్పకుండా ప్రశ్న ఉంటుంది అని.మొత్తం లింక్డ్ లిస్ట్ అంతా బట్టి పట్టాను.నిజంగా అది నాకు అర్థం కాలేదు.ఆ సమయం లో అర్థం చేసుకోవాలని కూడా అనిపించలేదు నాకు.


ఉదయం 9 గంటలకు వెళితే సాయంత్రం 4 గంటలకు పిలిచారు నన్ను. భయం భయం గా అడుగు పెట్టాను లోపలికి, జావా మీద కొన్న్ని ప్రశ్నలు, మా ప్రాజెక్ట్ మీద కొన్ని ప్రశ్నలు అడిగారు. చెప్పాను. తిండి లేదు .కడుపు కాలుతుంది. ఐపోయె సరికే 5 ఐంది. అవును నిజంగా గంట సేపు చేసాడు నన్ను ఇంటర్వ్యూ.తరువాత బయట వెయిట్ చేయమన్నాడు.అపుడు అడిగాను, సర్, ఈజ్ ఇట్ వర్త్ వెయిటింగ్? ఐ హావంట్ ఈవెన్ హాడ్ మై లంచ్ అని. అతను బిగ్గరగా నవ్వి, యస్ అన్నాడు. ఆహా, ఆకలి మాయం. ఎగురుతూ బయటికి వెళ్ళాను. హెచ్.ఆర్ రేపు ఉంటుంది రమ్మని చెప్పారు.ఇంకేముంది? అయిపోయింది.సెలెక్ట్త్ అయిపోయాను. టెక్నికల్ అయిపోయాక హెచ్.ఆర్ ఏముంది. అప్పటికే హెచ్.ఆర్ ఐపోయిన వాళ్ళు చెప్పారు. లైట్ అని.ఇంకేముంది. అయిపోయింది అంతే. కానీ, మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు.


హెచ్.ఆర్ రౌండ్ మొదలు అయింది.బాగానే సాగుతోంది బండి. నీ యాంబిషన్ ఏమిటి అనే ఫ్రశ్నకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టలని అని చెప్పాను సమాధానం.నవ్వాడు.తరువాత ఇంకొన్ని ప్రశ్నలు.చివరగా సంతకం పెట్టే ముందు అడిగాడు, ఔను నీకు సాఫ్ట్వేర్ కంపనీ పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి అని?నేను ఒక 50-60 లక్షలు చాలు అనుకుంటున్నాను అని చెప్పను. సంతకం పెట్టబోతున్న పెన్ ని కింద పెట్టాడు, నా వైపు అదోలా చూసి అడిగాడు.ఎపుడు పెడతావు అని? ఒక 20 సంవత్సారాల తరువాత సర్ చెప్పను నేను. తను అన్నాడు, 20 సంవత్సారల తరువాత 60 లక్షలు అంటే 20 లక్షల తో సమానం. నువు 20 లక్షలతో ఒక కంపని పెట్టగలను అనుకుంటున్నావా?దీన్ని బట్టి నాకెమి అర్థం ఔతుంది అంటె, నీకు భవిష్యత్ గురించి ఆలోచించే శక్తి లేదు. నిన్ను నేను ఎందుకు తీసుకోవాలి,ఒక రీజన్ చెప్పు అన్నాడు. అంతే,ఏమి చేయాలో తెలియడం లేదు నాకు. అంతా శూన్యం లా అయిపోయింది.ఒక 3 నిమిషాలు అలానె చూస్తూ ఉండిపోయాను.మళ్ళి, రెట్టించాడు తను.ఇక ఏదో ఒక సమాధానం చెప్పక తప్పదు.ఇంకొక నిమిషం అలోచించాను.చెప్పాను.తప్పో,ఒప్పో నాకు అనవసరం. ఆ సమయానికి అతడిని కన్విన్స్ చేయ గలగాలి అంతే నేను ఆలొచించింది.చెప్పడం మొదలు పెట్టాను.




సర్,ఒక పది సంవత్సారాల క్రితం 64 ర్యాం, 40 జి.బి హాఋడ్ డిస్క్ ఉన్న కంప్యూటర్ విలువ 50,000.ఇప్పుడు దానికి 4 రెట్లు సామర్థ్యం కలిగిన కంప్యూటర్ విలువ 15,000. 20 సంవత్సారాల తరువాత దీనికి 4 రెట్లు సామర్థ్యం కలిగిన కంప్యూటర్ విలువ 5000 అవొచ్చు. నేను చాలా కంప్యూటర్లు కొనగలుతాను అప్పటికి ఆ డబ్బుతో, ఒక నలుగురిని హైర్ చేసుకుని, ఒక 3 నెలలు ఏ ఆర్డర్ లేకపొయినా జీతం ఇవ్వగలుగుతాను.కాబట్టి నేను కంపనీ పెట్టగలను అనే అనుకుంటున్నాను అని చెప్పాను. చాలా గట్టిగా , ఒక 5 నిమిషాలపాటు నవ్వాడు.తరువాత అడిగాడు ఆ కంపనీలో నాకు ఉద్యోగం ఇస్తావా అని? నేను చెప్పాను మీరు వస్తే అని.


తరువాత ఏమయిందో చెప్పనవసరం లేదనుకుంటాను.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నేను ఆ హెచ్.ఆర్ కి అలా సమాధానం చెప్పి నేటికి సరిగ్గా సంవత్సరం.

19, నవంబర్ 2010, శుక్రవారం

పీత కష్టాలు

నా చిన్నపుడు ఆరవ తరగతిలోనో,ఏడవ తరగతిలోనో మా స్కూల్ లో చదివిన ఒక విధ్యార్థికి గేట్ లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది.తరువాత స్విట్జర్ల్యాండ్ లో ఒక బహులజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చిన తరువాత మా స్కూల్ కి వచ్చాడు సూట్ వేసుకుని.ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.అతను వెళ్ళాక మా మాష్టార్లందరూ బాగా చదివితే అల సూట్ వేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లవుతారు అన్నారు.అప్పటి నుండీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బాషా సినిమాలో రజనీకాంత్ కి తక్కువ కాకుండా ఉంటాడని కలల్లో ఊహించుకుంటూ బ్రతికేవాడిని.

కానీ,ఈ మధ్య నా కలలు అన్నీ కల్లలు అని అర్థం అయింది.ట్రైనింగ్ అయిపోయి ప్రాజెక్ట్లో పడగానే నాపీత కష్టాలు మొదలయ్యాయి.ఎనిమిది గంటలకు తప్ప బ్రష్ మీద పేష్ట్ వేయని నేను ఆరు గంటలకల్లా నూనెపెట్టిన జుట్టు నున్నగా దువ్వుకుని షటిల్ కోసం చెన్నై రోడ్ల మీదపిచ్చి కుక్కలా పరుగులు పెడుతున్నాను.

వెళ్ళగానే కేటీ లు,రివర్స్ కేటి ల తోటి ప్రారంభమయింది నా కష్టాల కడలి ఈదడమనే ప్రక్రియ.చెప్పేవాడు ఏమి చెపుతునాడో అర్థం కాదు,పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వింటున్నరేమో అని తల తిప్ప్పి చూస్తే రాసుకోవడానికి ఇచ్చే రైటింగ్ పాడ్ మీద పిచ్చి గీతలు గీసే వాళ్ళు కొందరు,చెప్పేవాడు ఏమి చెప్పినా అది తప్పని వాదించేవారు కొందరు,కళ్ళు తెరుచుకుని,చెవులు మూసుకుని నిద్రపోయేవాళ్లు కొందరూ,చెప్పేవాడి వైపూ, వాదించే వాడి వైపూ వాళ్ళు దేని గురించి కొట్టుకుంటున్నారో అర్థం కాక అహ నా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందంలా పిచ్చి చూపులు చూసే నాలాంటి వాళ్ళు ఇంకొందరు.

అలా కొన్ని రోజుల తరువాత డిజైనింగ్ ఫేజ్ మొదలైంది.ఇది నా కష్టాల కడలిలో ఒక ఆసక్తికర ఘట్టం.మా టీంలీడర్ నాకు చెవులు వాచేలా చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి నాలుగు సెట్లు డెజైన్ చేయమన్నాడు.ఇక నేను నా ప్రతిభ అంతా చూపిద్దామని రంగంలోకి దిగాను.రెండు రోజుల తరువాత నా పని అంతా రివ్యూ టీం కి పంపించాడు మా టీం లీడర్.

మరుసటి రోజు ఉదయం కొంచెం లేట్గా ఆఫీస్ కి వెళ్ళాను.వెళ్ళగానే పని తర్వాత చేద్దమని,ఈ పేపర్ చదువుతున్నాను.వెనక నుండి మా రివ్యూ టీం లీడర్ వచ్చాడు.ఏం బాబూ బిజినెస్ న్యూస్ చదువుతున్నావా అని అడిగాడు.అవును లీడర్ గారూ, సెన్సెక్స్ ఈ మధ్య డవున్ అవుతోందనుకవొచ్చనుకుంటున్నాను అని నా విశ్లేషణను మొఖం మీద నవ్వు పులుముకుని చెప్పి,కాంప్లిమెంట్ కోసం తలవంచుకుని ఎదురు చూస్తున్నాను. మా టీం లీడర్ గాడు అన్నాడు,నువ్వు అల్రెడీ డవునయిపోయావు బాబూ. నీ మెయిల్ చెక్ చెసుకున్నావా అని అడిగాడు.లేదని చెప్పాను.ఇక మొదలు, వచ్చిందే లేట్, మళ్ళీ రాగానే కనీసం మెయిల్ కూడా చెక్ చెసుకోకుండా, ఏదో దేశాన్ని ఉద్ద్ధరించేవాడిలాగా పేపర్ ముందేసుకు కూర్చుంటావా అని దిమ్మదిరిగి బొమ్మ కనపడేలాగా చివాట్లు పెట్టిపోయాడు.

మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే అప్పటికే 6 మెయిల్స్ వచ్చాయి మా రివ్యూ టీం నుండి.ఒకకటి పరి పరి విధాలుగా నాను తిడుతూ రాసినవి.ఒక మెయిల్లో నేను చేసిన తప్పుల చిట్టా ఉంది. మా రివ్యూ టీం లీడర్ రాసింది.దాని సారాంశం ఏమిటంటే "ఒరేయ్ వెధవా నువు చేసిన పని మొత్తం తప్పే,కనీసం డెజైన్ డాక్యుమెంట్లో నీ పేరు కూడా కరెఖ్ట్ గా రాసుకోలేదు రా శుంఠ".


మా టీం లీడర్ వచ్చి బాబూ పరువాలేదు,దానిని సరి చేసి,ఈ రోజు పని పూర్తి చేసి, నిన్న చేసిన పనిని ఒక సారి సెల్ఫ్ రివ్యూ చ్వేసుకుని, నిన్న నీకు పంపిన మొన్నటి పనిలో వచ్చిన కామెంట్స్ సరి చేసి రేపు చేయాల్సిన పనికి గ్రౌండ్ వర్క్ చేసి వెళ్ళిపో అంతే అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోయాడు.


ఓరి నాయనో! ఏమిటీ పని.ఎపుడు ప్రాజెక్ట్ మేనేజర్ అవుతాను,పనిలేకుండా ఒక మూలకు కూర్చుని అందరినీ అజమాయిషీ చేస్తూ కూర్చుంటానో!

15, నవంబర్ 2010, సోమవారం

తాతయ్య కబుర్లు-1

ఆనందోబ్రహ్మ అయిదవసారో,ఆరవసారో చదువుతున్నాను.ఎందుకో ఈ సారి ఎప్పటి కన్నా,కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతుంది మరి.సోమయాజికి తన తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు యండమూరి.

అందమైన జీవితంలో మల్లాది గారు చెప్పినట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ తాతయా లేదా అమ్మమ్మతో కొంత కాలమైనా గడిపే అవకాశం రావాలి.ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశం ఉండబోదనుకుంటా.ఈ విషయంలో నేను చాలా,చాలా అదృష్టవంతుడిని.నాకు మా ఇద్దరు తాతయ్యలతోటి చాలా చక్కని అనుబంధం ఉంది.నాకు తెలిసి మా నాన్న తరుపు బంధువుల పిల్లలు, అంటే మా బావలు,వదినల కంటే మా తాతయ్యతో నాకే చనువు ఎక్కువ.మా తాతయ్యతో నాకున్న అనుబంధాన్ని మీతో పంచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం.


నేను చిన్నపుడు మాఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో చదువుకున్నాను.ప్రతీ రోజూ రిక్షాలో వెళ్ళి వచ్చేవాడిని.సాయంత్రం నేను ఇంటికి వచ్చే వేళకి నాకోసం ఇంటి ముందు ఎదురు చూసేవాడు.రిక్షా ఇంటి ముందు ఆగగానే దాని కొక్కేనికి ఉన్న నా స్కూల్ బ్యాగ్ తీసుకుని,నా వేలు పట్టుకుని నాను ఇంటికి లోపలికి తీసుకుని వెళ్ళేవాడు.చక్కగా నాకు వేరే బట్టలు తొడిగి నా చేత హోంవర్క్ చేయించేవాడు.

నేను చిన్నపుడు లెక్కల్లో చాలా వీకు(ఇప్పుడు కూడా),అందుకని ఓపికగా ప్రతీ అంకె ముందూ గీతలుగీయిస్తూ,వాటిని కొట్టేయిస్తూ నాకు కూడికలు,తీసివేతలు చెప్పేవాడు. హెచ్చవేతలు చేయడానికి మాత్రం పిచ్చి లేపే వాడిని.

ఇప్పటికీ మా అమ్మ అంటూ ఉంటుంది,నాకు నాలుగు అక్షరం ముక్కలు అబ్బాయంటే దానికి కారణం మీ తాతయ్యేరా అని.మా అమ్మ కూడా నేను చదువుకున్న స్కూల్ లోనే పని చేసేది.తను నా కన్న కొంచెం లేట్ గా వచ్చేది రోజూ.తను వచ్చేసరికి నేను గోనె పట్టా మీద పందిరి గుంజకి ఆనుకుని ఎక్కాలు చదువుతూ ఉండేవాడిని.

మా తాతయ్య చదువు దగ్గర ఎంత ఖచ్చితంగా ఉండేవాడంటే,ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రశ్న కి సమాధానం సరిగా రాకపోతే,ఏ వార్తలు చూస్తున్నపుడో ఒప్పచెప్పించుకోమని మా నాన దగ్గరికి వేళ్ళేవాడిని.మా నాన వార్తలలో పడి నేనేం చెప్తున్నానో పట్టించుకునేవారు కాదు.ఒకసారి మా తాతయ్య అది గమనించి మా నాన్న దగ్గరినుండి నా నోట్స్ లాక్కుని నన్ను నాలుగు తగిలించి మొత్తం సమాధానం వచ్చిందాక చదివించాడు.

ఒక సారి పరీక్షలలో ర్యాంక్ రాకపోవడం వల్ల ప్రైజ్ కోల్పోయి ఏడుస్తుంటే,ఏడిస్తే ర్యాంక్ రాదు,చదివితే వస్తుందని చెప్పితరువాతి పరీక్షలకి నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని చదివించాడు.ఆ తరువాతి పరీక్షలలో నాకు క్లాస్స్ లో మొదటి ర్యాంక్ వచ్చింది.కానీ,ఈసారి మా స్కూల్ వాళ్ళు ఎలాంటి ప్రైజ్ ఇవ్వలేదు.అపుడు మా తాతయ్యే ఒక పెన్ నాకు కొనిచ్చ్హాడు.దానిని నేను ఎంతో మురిపెంగా మరుసటి రోజు స్కూల్ లో అందరికి చూపించాను.అదే రోజు ఆ పెన్ పోగొట్టుకున్నాను కూడా. చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు తలుచుకుంటే.

మా తాతయ్య గురించి చెప్పినపుడు మూడు విషయాలు చెప్పకుంటే అది అసంపూర్ణం. అవి

1.పేకాట.

2.క్రికెట్.

3.సిగరెట్.

వీటి గురించి తరువాతి టపాలో.



9, ఆగస్టు 2010, సోమవారం

ఎందుకిలా?

ఉద్యోగం వచ్చేంత వరకూ ఎవరైనా నన్ను, ఏం చేస్తున్నావు బాబూ అని అడిగితే, ఇంజనీరింగ్ అయిపొయింది అని చెప్పడానికి చాలా భయపడేవాడిని.ఎందుకంతే వెంటనె ఒక అనుబంధ ప్రశ్న అడుగేవారు,అవునా మరి future plans ఏమిటి అని.నేను సమాధానం ఏమీ చెప్పేవాడిని కాదు.ఎందుకంటే నాకే తెలియదు,నా ప్రణాళిక ఏమిటో.కానీ నిన్న మొట్టమొదటిసారి నేను ఇంజనీరింగ్ చేసాను అని,నేను ఒక ఇంజనీర్ని అని చెప్పుకోవడానికి "సిగ్గుపడ్డాను".

ఉద్యోగంలో చేరి రెండు వారాలు అయింది.ట్రైనింగ్ కూడా పూర్తి స్థాయిలో మొదలవకపోవడంతో, ట్రైనింగ్ కి అవసరమైన పుస్తకాలు కొందామని అనుకుంటున తరునంలో,మా స్నేహితుడు ఒకడు "ఒరేయ్ మా స్నేహితుడొకడు "IIT,MADRAS" లో చదువుతున్నాడు.వాడి దగ్గరకి వెళ్ళి మనకు కావలసిన పుస్తకాలు తెచ్చుకుందాము అని సలహా ఇచ్చాడు.దానితో అందరంIIT,MADRAS కి బయలుదేరాము.గేటు దాటి లోపలకు అడుగుపెట్టాగానే కళ్ళు బైర్లు కమ్మాయి.ఎటు చూసినా చెట్లు,జింకలు,పచ్చదనం.అక్కడే క్యాంపస్ బస్ ఎక్కి నర్మద హాస్టల్ కి చేరుకున్నాము.అక్కడ పరిచయ,పలహార కార్యక్రమాలు పూర్తి అయ్యాక మా వాడి స్నెహితుడు అక్కడ స్ట్యూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ వీడియోస్ చూపించాడు.అవి చూస్తుంటే ఒక్కసారిగా నేను కరిక్యులంలో భాగంగా చేసిన ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చింది.

ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడ,మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్యూడెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ ఎక్కడ?అవి కూడా వాళ్ళు కరిక్యులంలో భాగంగా చేసిన ప్రాజెక్ట్స్ కావు.వాళ్ళ సొంత ఆసక్తితో చేసినవి.అవి కూడా చిన్న,చిన్న లాజిక్స్ మీద ఆధారపడినవి.చాలా చిన్న లాజిక్ మీద ఆధారపడినవి.ఉదాహరణకి నేను చూసిన వాటిలో "self balancing bicycle"అనే ఒక ప్రాజెక్ట్ ఉంది.దానిని మనం మన హ్యూమన్ ఫోర్స్ ఉపయొగించి తొక్కనవసరంలేదు.దాని మీద కూర్చుంటే అదే మనల్ని తీసుకుని వెల్తుంది.అది ఎలా చేసారు బాసూ అని అడిగితే దాని లాజిక్ చెప్పాడు,మనం సైకిల్ తొక్కుతున్నపుడు, బ్యాలన్సింగ్ కోసం హ్యాండిల్ ఆటు,ఇటు కొంచెం తిప్పుతుంటాము.అదేపనిని ఇక్కడ ఒక మోటర్ చేస్తుంది.మనం సైకిల్ తొక్కము కాబట్టి,అది నడవడానికి,వెనక టైర్ కి ఉన్న ఫ్రీవీల్ కి ఒక మోటర్ అమర్చాము,అది వెనక టైర్ ని తిప్పుతుంది.దీని స్పీడ్ కి తగ్గట్టు,హ్యాండిల్ మూమెంట్ని దానికి అమర్చిన మోటర్ నియంత్రిస్తుంది.


చెప్పడానికి చాల చిన్న లాజిక్కే,కానీ దానిని పనిచేయించడానికి వాళ్ళు ఎంత కశ్టపడ్డారో చెపుతుంటే,మళ్ళి నాకు మేము చేసిన ప్రాజెక్ట్ గుర్తుకువచ్చింది.కొన్న ప్రాజెక్ట్కి ఒక చిన్న మాడిఫికేషన్ చేయమని మా H.O.D అంటే అది చేయలేక నానా చావు చచ్చాం.

చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రాజెక్ట్ కోసం బయటికి పంపిస్తారు.అది స్ట్యూడెంట్స్ కి ఒక లీజర్ పీరియడ్.ప్రాజెక్ట్ అనగానే,అందరూ రెక్కలు కట్టుకుని అమీర్పేటలో వాలిపోవడం.తలా ఒక 500 వేసుకుని,ఒక చక్కని (అలా అని ఇన్స్టిట్యూట్ వాడు చెపుతాడు) ప్రాజెక్ట్ కొనొక్కుని వారనికి ఒకటి లేదా రెండు క్లాసులకు అటెండ్ అవుతూ,జల్సా చేయడం.అందరూ ఇలానే అని కాదు,కొందరు మాత్రమే ఇలా కాకుండా వారానికి మూడు రోజులు క్లాస్ కి అటెండ్ అవుతుంటారు. మొత్తానికి డాక్యుమెంటేషన్,చివరికి పొవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాడి దగ్గరే తీసుకుని దానిని కాలేజీలో ప్రెజెంట్ చేయడం.ఎలాగూ అక్కడ ఉండేది మన సినియర్లే(కాకపోతే వీళ్ళని లెక్చరర్లు అని పిలుస్తారు) కాబట్టి, ఎవొడూ ఏమీ అడగడు.అలా 200 కి 198 మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్ పట్టాలో చూసుకుని మురిసిపోతుంటాము.

వాళ్ళకి,మనకి ఎందుకు ఆ తేడా?మన రాష్ట్రంలో దాదాపు 700 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.వాటిలో ఎన్నంటిలో ఇలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి.అడపా,దడపా విజ్ఞాన్,వరంగల్ లోని ఒకటి,రెండు కాలేజీలని,అక్కడ,ఇక్కడాకొన్ని కాలేజీలని మినహాయిస్తే,ఎక్కడ మన ఇంజనీరింగ్ ప్రదర్శించేది.

అసలు దీనికి కారణం ఏమిటి? మా క్లాస్ లోని 60 మంది స్ట్యూడెంట్స్ కి, ఒక కొత్త కంప్యూటర్ ని విడి,విడి భాగాలుగా ఇచ్చి,కనెక్ట్ చేయమంటే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు(అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు ).విధ్యార్థులలో ఏదైనా చేదామనే ఉత్సాహం ఉండదు,ఉత్సాహం ఉన్న వాడికి ప్రోత్సహం ఉండదు.కనీసం అసలు టెక్నాలజీ ఎలా ఉంది బయట ప్రపంచంలో దాని వాడుక ఎంతవరకూ అంటె ఏ ఇంజనీరింగ్ విధ్యార్థి చెప్పడు.

కరిక్యులంలో భాగంగా టెక్నికల్ సెమినార్ ఇవ్వవలిసి వస్తే,మా కాలేజీ నుండి ప్రతిఒక్కరూ అంతకు ముందు వడో ఇచ్చిన సెమినార్ని మల్లీ చెప్పడమే(నేనూ అతీతుడిని కాదు).
ఎందుకు మన ఇంజనీరింగ కాలేజీలు ఇలా తగలబడ్డాయి.కనీసంsimple past tense లో ఒక వాక్యాన్ని సరిగ frame చేయలేని వాళ్ళు కూడ,లెక్చరర్లుగా ఉన్నంత కాలం మన ఇంజనీరింగ్ విధ్యార్థులు నేను ఇంజనీర్ ని అని గర్వంగా చెప్పుకోలేరు.

23, జూన్ 2010, బుధవారం

కులాలు-కులాంతర వివాహాలు-నా అభిప్రాయం

ఈ మధ్య చాలా బ్లాగులలో కులాల గురించి కుమ్ములాటలు జరూతున్నాయి.నేను బ్లాగులొకంలోకి వచ్చి కొంతకాలమే అయింది, అయినా కులాల మీద నా అభిప్రాయం కూడా చెపుతాను. ఇది నేను నా తర్కంతో ఆలోచించినది. అందరూ దీనిని సమర్ధిస్తారని నేను అనుకోను కానీ చాల కొంత మంది విమర్శిస్తారని మాత్రం అని అనుకుంటున్నాను.

అసలు మానవజాతి పరిణామ క్రమంలో ఈ కులాలు.మతాలు వచ్చి చేరి చాలా కొద్ది కాలం అయిందని నా అభిప్రాయం.చాల మంది కుల వృత్తులు అంటారు కానీ,నన్ను అడిగితే అది వృత్తి కులాలు .అంటే ఏదో ఒక వృత్తి చేసుకుని బ్రతికే తెగలు అని .

మొదటిలో మానవులంతా ఇలా వృత్తుల పరంగా వివిధ వర్గాలుగా విడిపోయి,ఎవరి జీవనోపాధి వారు చూసుకుని ఉంటారు.ఆ కమ్యూనిటీనే తరువాత కులం అయి ఉండొచ్చు. అందులో డిమాండ్ ఉన్న వృత్తి చేసిన వారు లేదా ఎక్కువ మంది ప్రజలు ఏ వృత్తి అయితే చేసే వారో, వారు ఆర్ధికంగా కొంచెం బలంగా ఉండడం మూలాన అగ్ర కులాలు అయి ఉంటారు.

ఒక కులం వారంతా ఒకే పని చేస్తారు కాబట్టి,వివాహ సమయంలో అదే కులం వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి అయితే ఆ పని మీద కొంచెం అవగాహన ఉంటుందని,అది వారు ఆర్ధికంగా ఎదగడానికి ఉపయోగపడవచ్చుననో ,పనిలో చేదోడువాదోడుగా ఉంటుందనో ఒకె కులానికి చెందిన వారంతా అదే కులానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం మొదలు పెట్టి ఉండొచ్చు. అదే తరువాత పెరిగి వటవృక్షం అయి ఇపుడు కులాల పేరు మీద కుమ్ములాటలు జరిగే స్థాయికి చేరింది.

ఇక కులాంతర వివాహాల విషయానికి వస్తే రెందు వేరు వేరు కులాలకి చెందిన వారు వివాహం చేసుకోవద్దు అని అనడం మూర్ఖత్వం.రెండు వేరు,వేరు కులాల వారు వివాహం చేసుకోవద్దు అంటే రెండు వేరు,వేరు వృత్తుల వారు కూడా వివాహం చేసుకోవద్దు.ఒక బ్యాంకు ఉద్యోగి,మరొక బ్యాంకు ఉద్యోగిని మాత్రమే చేసుకోవాలనడం ఎంత అవివేకమో,కులాంతర వివాహాన్ని వ్యతిరేకించడం కూడా అంతే అవివేకం.

24, ఏప్రిల్ 2010, శనివారం

వెన్నెల్లో ఆడపిల్ల-నిద్రలో పీడకల

అవి మేము ఇంకా కోదాడకు రాని రోజులు,అప్పుడు మా వీధిలో మా ఒక్కరి ఇంట్లో మాత్రమే టి.వి ఉండేది.చుట్టుపక్కల అమ్మలక్కలందరూ పనులు అయిపోయాక మా ఇంటికి వచ్చి సీరియల్స్ చూసే వాళ్లు.

అప్పుడు సీరియల్స్ కూడా ఇప్పటి సీరియల్స్ లా జీడిపాకం సీరియల్స్ కాదు.7:30 కి వార్తలు అయిపోయాక వచ్చి 8:30 వరకు టి.వి చూసి వెళ్ళేవారు.8:30 కి ధారావాహిక కార్యక్రమాలు అయిపోయాక తరువాతి రోజు వచ్చే కార్యక్రమాల గురించి చెప్పేవారు.అలా ఒకరోజు అందరూ వెళ్ళిపోతున్న సమయంలో రేపటి నుండి రాత్రి 8:00 గంటలకు వెన్నెల్లో అడపిల్ల ధారావాహిక కార్యక్రమం అని వెసారు,అది చూడగానె నాన్న "అబ్బ!చాలా మంచి సీరియల్" అని అన్నాడు.అంతే అమ్మలక్కందరూ రేపటి నుండి ఆ సీరియల్ చూసితీరుతామని ప్రతిన బూని వెళ్ళారు.

అప్పటికి నేను ఏ రెండో తరగతో చదువుతూ ఉండొచ్చు.అప్పుడు నాకు ప్రేమ కథలు అంతగా నచ్చేవి కాదు.ఆ వయసు వాళ్ళకి ఎవరికీ నచ్చవనుకుంటా.అందుకే నేను అంతగా పట్టించుకోలేదు,నా మట్టుకు నాకు ఆదివారం పూట వచ్చ్చే శ్రీకృష్ణ అంటే చచ్చేంత పిచ్చి.అందులో యుద్ధాలు గట్రా చూడడం అంటే మహ సరదా.

వెన్నెల్లో ఆడపిల్లా ఏ రోజు వచ్చేదో కూడ సరిగా గురుతు లెదు,కాని అది వచ్చె రోజు ఇళ్ళు ఒక జాతర అయేది.కొన్ని రోజులకే చిత్రలహరి లాంటి పాపులర్ కార్యక్రమాన్ని డామినేట్ చేసేసింది.( ఇది నేను ఆ రెండు రోజులూ మా ఇంటికి వచ్చే జనాభాని బట్టి వేసిన చిత్తు లెక్క మాత్రమే ).

నాకు చాలా బోల్డు హాశ్చెర్యం వెసేది ఆ అభిమాన గణాన్ని చూస్తే.అలా అలా గడుస్తూ ఇప్పటి సీరియల్స్ లా కాకుండా ఆ సీరియల్ క్లైమాక్స్ కి వచ్చేసింది.రేపు చివరి భాగం అనగానే ఆ రోజు ఎపిసోడ్ న మిస్ అవకూడదని అందరూ తీర్మానించుకుని తరువాత రోజు టంఛనుగా వచ్చి వాలాయి అభిమాన చకోరాలు.

నాకు కూడా అంత మంది జన సందొహాన్ని చూసే సరికి కుతూహలం కాస్త పెరిగింది.నేను కూడ చూద్దామనికూర్చున్నాను టి.వి ముందు.లీలగా క్లైమాక్స్ గురుతుంది చివరకు గులాబి పూల దండలోంచి హీరోయిన్ చేయిని చూపిస్తారు,ఆ చెతికి ఒక ఉంగరం ఉంటుంది.హీరో ఆ అమ్మాయి శవాన్ని చూడ కుండానే వెనుదిరుగుతాడు.

నాకు అప్పుదు అంత బాగా నచ్చలేదు కానీ,మా ఇంటికి వచ్చిన ప్రేక్షక మహాశయులంతా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఒకరిని ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఏదో విధి అనీ,కలికాలం అనీ నొచ్చుకుంటూ బాధా తప్త హృదయాలతో వెళ్ళిపోయారు.

****************************************************************

కట్ చేస్తే

****************************************************************

2006వ సంవత్సరం.నేను మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళితే నాకు "విజయానికి అయిదు మెట్లు" పుస్తకం ఇచ్చి చదవమన్నాడు.దానికి పబ్లిషర్ రాసిన ముందు మాటలో ఒక పాయింట్లో అప్పటిలో వెన్నెల్లో ఆడపిల్ల విడుదల అయిన మొదటి రోజే కాపీలన్నీ అమ్ముడయ్యాయి అని రాసాడు.

అప్పుడు మొదటి సారి నాకు ఆ నవల చదవాలని అనిపించింది.ఎలా?ఎక్కడ దొరుకుతుంది?తెలియదు.అసలు తెలూ నవలలు ఇప్పటికీ అమ్ముతునారన్న విషయం కూడా తెలియదు.ఎలగైనా చదవాలని అనుకున్నాను.అలా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నవల చదవకుండానే అయిపోయింది.


రెండో సంవత్సరం ఇంటర్ సెమిష్టర్ హాలిడేస్ కూడా వచ్చాయి కాల క్రమంలో.అలా మళ్ళీ ఒక రోజు మా బాబాయి ఇంట్లో పుస్తకాలదొంతరలో వెతుకుతుంటే అపుడు నా కళ్ళ బడింది ఆ పుస్తకం. చప్పున తీస్కుని బయటపడ్డాను. ఆ రాత్రి ఎలాగైనా పూర్తి చేసేయాలి అని డిసైడ్ అయిపోయాను.


ఆ రోజు రాత్రి

అన్ని పనులూ,అన్నం తినడం వగైరా వగైరా అన్నీ త్వర త్వరగా పూర్తి చేసి 8:00 గంటలకు పుస్తకం పట్టుకుని కొర్చున్నాను.నేను కొన్ని పేజీలు మాత్రమే తిపాను,తరువాతంతా పుస్తకమే నా చెత మిగతా పేజీలన్నీ చదివించింది.అసలు చదువుతున్నంత సేపూ నేను నాలో లేను.ఆ కథ జరుగుతున్న ప్రదేశంలో వాళ్ళ మధ్య ఇరుక్కుపోయాను.

అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది యండమూరికి అని హాశ్చెర పడిపోయేను.ఎంత బాగా రాసాడంటే,అసలు అమ్మాయి అంటే
రమ్య మాత్రమే అనిపించేలా ఉంటుంది.ఆ అమ్మాయి తెలివితేటలూ,ఒక చదరంగ గ్రాండ్ మాస్టర్ ని ఒక చిలిపి అమ్మాయి ఆట పట్టించిన విధానం.యండమూరి ప్రతి ఒక్క పాత్రకీ ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాడు.ప్రతో పాత్రా ఆకట్టుకుంటుంది,ముఖ్యంగా జేంస్ పాత్ర.

నవల చివరి 30 పెజీలు చదౌవుతున్నంత సేపు నా చేతి గోర్లన్నీ పళ్ళ దాడికి బలైపోయాయి.ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు తను వలచిన అమ్మాయి కోసం ఆట ఓడిపోయినా కోఓడా పర్వాలెదనుకుని,ఒక క్లూ దొరకగానే చిన్న పిల్లాడిలా పరుగు పరుగున వెళ్ళి రమ్య అడ్రస్ కనుక్కోవడం చాలా బాగా రాసాడు.

ఇందులో బాగా ఆకట్టుకునే ఇంకో విషయం రమ్య,రెవంత్ కి రాసే నాలుగు లేఖలు.అందులోనూ చివరి లేఖ కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది.
ఆఖరుకి చాలా హృద్యంగా ముగిస్తాడు.


అప్పుడు అర్థం అయింది నాకు,చిన్నప్పుడు అమ్మలక్కందరూ ఎందుకు ఏడ్చారోఈ.చదివాక నేను ఏడ్చాను.


అసలు ఎంతలా ఫీల్ అయ్యానంటే,రమ్య చనిపోయిన తరువాత రేవంత్ మానసిక పరిస్థితి వివరిస్తూ నేనే ఒక రచన చేయాలన్నంత.

బరువుగా బాధపడి,దాన్నుండి తెరుకుని టైం చూద్దును కదా 3:00 అయింది.


ఇక నిద్రకు ఉపక్రమిద్దామనుకుని మంచం ఎక్కాను.కష్టంగా కలత నిద్రలోకి జారుకునాను.ఆ రాత్రి నిద్ర సరిగా పట్టలేదు.
ఎలాగైనా ఈ నవలని మినిమం నలగురి చేత చదువించాలనుకున్నాను.హాలిడేస్ అయిపోగానే పుస్తకం కాలేజ్ కి తీసుకు వెళ్ళాను.మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చాను చదవమని,చదివాక అందరిది ఒకే మాట "నిద్ర పట్టడం లేదు బాసూ!".

పట్టినా పీడకలలు, ప్రేమించిన అమ్మాయి చనిపోతే అని.

17, ఏప్రిల్ 2010, శనివారం

చిత్రలహరి చిక్కులు తెచ్చిపెట్టిన విధంబెట్టిదనిన......

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

భళి భళి భళి భళి అదిగో వచ్చెను క్రిష్ణయ్య,ఆ ఉగ్ర ర్రూపమే చుడవయా...

కుడి చేతిని పైకెత్తి........ఆహో
ఎడమ చేతితో తొడ కొట్టి.....ఆహో

కదనరంగమున కట్టె పట్టుకుని కాలు దువ్వెనే....

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

అంతట నారద మునీంద్రుల వారు వచ్చి ప్రలయకాళ రుద్రుని వలె కనిపిస్తున్న క్రిష్ణుల వారితో,

ఎందుకయ్యా క్రిష్ణయ్యా,ఏమి ఆ మహోగ్ర రూపం,ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావేమిటయ్యా? అని అనెను.

దానికి క్రిష్ణుల వారు వీరు పిచ్చుకలు కాదు నారదా,కీచకులు,వీరు చేసిన నేరము నీవెరుగవనెను.

దానికి నారదుల వారు వారు చేసిన నేరమేమని అడుగగా,క్రిష్ణుల వారు ఈ విధంగా సెలవిచ్చెను.

నారదా నీవెరుగుదువు కదా,ఈ చుట్టుపక్కల నాలుగు వీధుల వరకు మా ఇంటి లో తప్ప మరెక్కడ ద్రుశ్య శ్రవణ పరికరము(టి.వి) లేదు.కావున చుట్టుపక్కల పుర ప్రజలంతా మా గ్రుహమున కార్యక్రమములు వీక్షంచుటకు అలవాటు పడిరి.


దూరదర్శనమున పాడి పంటలుపశువుల పెంపకం కార్యక్రమము చూసిన తరువాత అమ్మలక్కల్లంతా పిల్ల జెల్లకు కూసింత కూడు వండి పెడదామని బయలుదేరారు.


తరువాత వార్తావాహిని కావడంతో ఎవరూ రాలేదు చూడడానికి,ఆ సమయమున మా కుటుంబ సన్నిహితురాలు చాల దూరము నుండి మమ్ముల చూడడానికై తన ద్విచక్ర వాహనము మీద ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చినది.


పేరుకు పరమాత్మనైనా,పాక ముందు పార్కింగ్ కి ప్లేస్ లేని ఇంట్లో ఉంటున్నాను.అందుకోసం తను మా ఇంటి వెనక ఉన్న రహదారి మీద వాహనము నిలిపి వచ్చినది.

కుశలప్రశ్నలు,పలకరింపులూ అయి మేము ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా ఈ వెధవ వచ్చి "క్రిష్ణుల వారూ 7:30 అయింది "చిత్రలహరి" వచ్చు వేళ అయినదని చెప్పెను.




చాలా కాలము తరువాత కలిసిన మా బంధువుతో మాట్లాడుతూ ఉండడం మూలాన నేను వాడిని ఒక పది నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.

వాడు సరిగ్గా లెక్క చూసుకుని పది నిముషాల తరువాత వచ్చి మళ్ళి చిత్రలహరి గురించి అడిగెను.

నేను ఈసారి ఒకింత కటువుగా అయిదు నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.


వాడు మళ్ళీ మూడు నిముషాలు కాకముందే గోడకు కొట్టిన బంతిలా వచ్చాడు,ఈసారి నేను కాస్త ఘాటుగా పెట్టడం కుదరదని చెప్పాను.వాడు మళ్ళీ తిరిగి రాలేదు.



మా బంధువుతో కబుర్లు అయిపోయాక వారిని సాగనంపడానికి వెళ్ళి చూద్దును కదా వారి ద్విచక్ర వాహనము కాస్తా రూపురేఖలు మారిపోయి,మన దేవేంద్రుని పుష్పకవిమానముని తలపించినది.


దాని ఆకారము వికారముగా ఐనది,వెనుక టైరు వంకర తిరిగిపోయినది,హ్యండిల్ హ్యమర్ పెట్టి కొట్టినట్టు వంద వంకర్లు తిరిగినది,హెడ్ లైట్ మీట నొక్కకుండానే వెలుగులు విరజిమ్ముతున్నది,పెడలు వెయ్యి గజముల ఎడముగా పడి ఉన్నది,సీటు సవా లక్ష చిరుగులు పడినది.



మొత్తముగా వాహనము,తెలుగు సినీ నాయకుడు బాలక్రిష్ణ తన బల ప్రదర్శనతో శత్రు సమూహమును మట్టుపెట్టిన పిమ్మట,వీక్షకుల మదిలో ఆలోచనల మళ్ళే అంతూ,పొంతూ లేకుండ ఉన్నది.


ఇపుడు చెప్పు నారదా?కేవలము చిత్రలహరి కోసము,చిత్తు కింద బండిని బద్దలు కొట్టిన వీడి బుర్ర క్రిష్ణ కీర్తన పాడించవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా?


దానికి నారదుడు మధ్యే మార్గముగా తప్పు వీడిది కాదు,కార్యక్రమముదని యోచించి దూరదర్శనమునకు పోటీగా మరికొన్ని ఛానల్స్ ని ప్రవేశ పెట్టి దానిని నిర్వీర్య పరిచినాడు.


శ్రీ మద్రమారమణ గోవిందో హా...

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

మండేనాడు

నేను పదవ తరగతి చదువుకునే రోజుల్లో మాకు మ్యాథ్స్ చెప్పిన సార్ పేరు రమణ కుమార్.ఇప్పటికీ అదే స్కూల్ లో పని చేస్తున్నాడు.

మామూలుగా ఎవరికైనా కోపం వస్తే తిట్టడం కద్దు.అందుకు మా సార్ ఏమి మినహాయింపు కాదు.కాకపోతే ఆ తిట్లు ఒకింత వింతగా ఉంటాయి.ఉదాహరణకి ఎవరైనా క్లాస్ చెపుతుంటే మాత్లాడుతున్నారనుకోండి ఒరేయ్ వెధవ ఒళ్ళు ఏమైనా టిమటిమలాడుతోందా కొడితే కిసుక్కుమంటావ్.

బెంచి కేసి కొట్టాననుకో బాక్సు బద్దలౌద్ది.

కొడితే పల్లు ఊడి కంపాక్సు బాక్సులో పడతై వెధవ.

మొహం మీద గుద్దితే మచ్చుకు పోల్చుకోడానికి కూడా పనికిరావు పంది.

ఇలా యతి ప్రాసలను తు.చ తప్పకుండా పాటిస్తూ తిట్టేవాడు.నిజానికి అలా వెరైటీ తిట్లు తినడం కోసమే కోంత మంది గొడవ చేసేవాల్లు.

ఇది మా సార్ గురించిన ఉపోద్ఘాతం.మా సార్ ప్రియ శిష్యుడు ఒకడున్నాడు.వాడి పేరు రవిశంకర్.బండ నా వెధవ.ఒక్క రోజు కూడా హోంవర్క్ సరిగా చేసేవాడు కాదు.వాడిని కొట్టీ కొట్టి సార్ కే విసుగు వచ్చి ఒక సారి వాడికి ఒక ఆఫర్ ఇచ్చాడు.

మా ఊరిలొ ప్రతి ఆదివారం పశువుల సంత జరుగుతుంది,అక్కడ పశువులకు కావలసిన అన్ని సామాన్లు అమ్ముతారు.కర్రలు,పలుపు తాళ్ళు వగైరా.మా వాడికి సార్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే ఒక మంచి కర్ర వాడి డబ్బులతో కొనుక్కువస్తే వాడికి దెబ్బల నుండి విముక్తి.

వాడు ఈ ఆఫర్ ని చాలా సద్వినియోగ పరుచుకున్నాడు.వాడి దెబ్బలు తప్పించుకోవడం కోసం మమ్మల్ని బలి పశువులని చేసే వాడు.

వారినికి ఒకసారి మా సారు వారు కర్ర విరగ్గొట్టడం,వీడు కొత్త కర్ర కొనుక్కురావడం ఇది చర్య.

కొంతకాలానికి వీడు బాగా ముదిరిపోయాడు,సారు వారికి కూడ వీడిని కొట్టక చేతులు బాగా దురద పెడుతున్న కాలమది.

ఒక రోజు ఆకస్మికంగా మబ్బు లేని వానలా,జబ్బు లేని చావులా నోట్స్ చెకింగ్ మొదలు పెట్టాడు.ఇంకంప్లీట్ గా ఉన్నవాల్లందరిని నిలబెట్టడు.ఆ మంద లో మా సారు వారి ప్రియ శిష్యుడు కూడా ఉన్నాడు.కాని అదే రోజు మా వాడు ఒక కొత్త కర్ర కొని తేవడంతో సార్ కి వాడిని కొట్టే అవకాశం లేదు,అందుకని ఒక డెడ్ కైన్ పెట్టి ఆ లోపు వీడు ఎలాగో వర్క్ కంప్లీట్ చేయడు కాబట్టి తన ప్రతాపాన్ని ఆరోజు చూపిదామనుకున్నాడు.

ఆ ఆలోచనతోనే "ఒరేయ్ రవిశంకర్ నువ్వు కనుక నాకు మండే రోజు హోం వర్క్ కంప్లీట్ చేసి చూపించలేదనుకో వీపు విమానం మోత మోగిస్తాను ఏమనుకున్నావో"

దానికి మా వాడు తాపీగా మీకు ఏ రోజు మండుతుందో నాకు ఎలా తెసుస్తుంది సార్ అన్నాడు.

అంతే సార్ కి మండే రోజు రానే వచ్చింది.మా వాడి పంట పండే రోజయింది

15, ఏప్రిల్ 2010, గురువారం

"మారో"చరిత్ర

గతంలో విడుదల అయి,ఘన విజయాన్ని సాధంచిన చిత్రాలని నేటి దర్శకులు తమని తాము గొప్ప క్రియేటివ్ దర్శకులుగా ఊహించుకుని మళ్ళీ రీమేకడం పరిపాటి అయిపోయింది.గతంలో రాంగోపాల్ వర్మ ఇలాగే షోలే చిత్రాన్ని మళ్ళీ తీసి చేతులు కాల్చుకున్నాడు.రాఘవేంద్ర రావు తన పాండురంగ "మహత్మ్యం" ని మన మీద ప్రయోగించిడం వలన కలిగిన అస్వస్థత నుండి పూర్తి గా కోలుకోక ముందే ఒక కొత్త దర్శకుడు మన మీద మరో చరుత్ర రూపంలో మరొ దండయాత్ర చేసాడు.

అలనాటి అమర చిత్ర రాజము మరో చరిత్ర.కమల్ హాసన్,సరిత ఆ పాత్రలలో ఒదిగిపోయారు.బాలచంద్రుడు ఒక రసరమ్య ప్రణయ కావ్యాన్ని తీసాడు.ఆ చిత్రం మళ్ళీ నూతన నటీనత వర్గం తో మళ్ళీ మన కళ్ళముందుకు వస్తుందంటేఎవరికైనా కుతూహలం ఉంటుది.నా బోటి కమల్ అభిమానులకైతే మరీను.

ఈ చితం మీద నా అభిప్రాయాన్ని చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పలి.నేను కమల్ అభిమానిని ఐనా కూడా నేను వరుణ్ సందేష్ నటనని కమల్ నటన తో పోల్చలేదు.పాత చిత్రాన్ని దీనితో ఏ విధంగా కంపేర్ చేయలేదు.

అయినా కూడా ఈ సినిమా నా ద్రుష్టి లో పరమ చెత్త సినిమాల విభాగంలో చేరింది.

ముందు కాస్టింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది.వరుణ్ ఆ పాత్రకి న్యాయం చేయలేక పోయాడు.ఇక కథానాయిక విషయానికి వస్తే మనసు చంపుకుని ఎలగైనా సరే తనని అతిలోక సుందరి అనుకుందామనుకున్నా మెదడు మొరాయించింది.హీరోయిన్లు అందరూ శ్రీదేవి అంత అందంగా ఉండకపోవచ్చు,కనీసం పాత్ర కి న్యాయం చేసే వారై ఉండాలి.అలనాటి సరిత కూడా అతిలొక సుందరి ఏమీ కాదు,కాని పాత్ర పరంగా చక్కగా సరిపోయింది.


కథ విషయనికి వస్తే ఆత్మ పాత చిత్రం నుండే తీసుకున్నారు,కాని రక్త మాంసాలు మార్చారు.


ఇక హీరో,హీరోయిన్ల నటన విసుగు పుట్టించేలా ఉంది.గుడిలో పాటకు ఇద్దరి మొహాల్లో కనిపించిన భావాలు చూస్తే దొందూ దొందే అనిపించింది.
హీరో డిక్షన్ ఏ మాత్రం బాగోలేదు.తను ఆ డిక్షన్ మార్చుకోక పోతే ఎంతోకాలం ఇండస్ట్రీ లో ఉండలేడు.

సంగీతం కూడా సోసో గా ఉంది.
మిక్కీ జె మేయర్ బాణీలన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి.

చెత్త స్క్రీన్ ప్లే,చెత్త నటన,అంతా కలిసి ఏ సినిమాలో చూడ దగ్గది ఏమి లేదు.దిల్ రాజు ఇక నుండైన దిల్ తో ఆలొచిస్తాడేమో చూడాలి.
ఈ చిత్రం గురించి ఈ టపా కూడా దండగే.

16, డిసెంబర్ 2009, బుధవారం

మా పేట వంట

"ఈ రోజు మనం మన అభిమాన మా పేట వంట కార్యక్రమంలో పనిలేనిపాలెం లో ఉంటున్న దోసకాయల చారమ్మ గారి ఇంటికి వెళ్తున్నాము".అంది టి.వి. యాంకర్.

నమస్కారం చారమ్మ గారూ...!
నమస్కారమమ్మా.
ఈ రోజు మీరు మాకు ఏ వంటకం గురించి పరిచయం చెయబోతున్నారు?
"పొట్లకాయ పంచదార చారు" అంది చారమ్మ.
"పొట్లకాయ పంచదార చారు" కాస్త అనుమానంగా,ఇంకాస్త అయోమయంగా వల్లెవేసింది యాంకర్.

మరి ఇహ మొదలెడదామా అంది యాంకర్.
తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ఎపుడెపుడు పదుగురెదుటా ప్రదర్శిద్దామా అని ఎదురు చూస్తున్న చారమ్మ ఇహ ఆగలేక కావాల్సిన పదార్థాల జాబితా ఏకరువు పెట్టింది.

పరస్పర విరుద్ధ పదార్థాలతో చారమ్మ తయారు చేయబోయే వంటకం కోసం మన యాంకర్ ఎదురు చూస్తుంది
చారమ్మ గొర్రెని చంపబోయే ముందు కసాయి వాడు సన్నద్ధం అయినట్టు తయారు అయింది.

తన సాంప్రదాయ జానపద అద్భుత వంటకం తయారు చేయడం మొదలు పెట్టింది.

మొదలు పోపు పెట్టింది.తను అలా మొదలుపెట్టిందో లేదో యాంకర్ మన చారమ్మ మీద ప్రశ్నల వర్షం కురిపించింది.
యాంకర్:చారమ్మ గారు మీ వారు ఏం చేస్తుంటారు?
చారమ:ఆ! నా బొంద! ఊరి మీద పడి తిరిగేవాడు.
యా:తిరిగేవాడు,అంటున్నారు?ఇపుడు లేరా?
చా:లేడు,ఉన్నంత కాలం నన్ను వేపుకు తిన్నాడు.
యా:మే వారు మంచి భొజన ప్రియుడనుకుంతాను!
చా:ఏడిచాడు,పేరుకు మొగుడు కానీ,ఏనాడన్నా ఒక సినిమాకు తిప్పాడా,షికారుకు తిప్పాద?ఒక చంద్రహారమూ లేదు,చేనేత చీరా లేదు.
యా:పోపు అయిపొయనట్టుందండీ?
చా:నీ మొహం! మాడి పోయింది.ఇన్ని వంటల కార్యక్రమాలు చేసావు,తేడా తెలియదూ?
యా:(మొహం నిండా నవ్వు పులుముకుని)మరి ఇపుడు ఏం చేద్దాం?
చా:ఏం చేస్తాం? మళ్ళీ పోపుపెట్టాల్సిందే.నా ఖర్మ, ఏం చేస్తాం,మొన్నటి దాకా మొగుడు చెయించుకున్నాడు,ఇపుడీ పిల్ల.ఖర్మ,ఖర్మ.
యాంకర్ ఇక తప్పేలా లేదనుకుని చారమ్మ గారూ,మరి ఇపుడు మనం ఒక బ్రేక్ తీసుకుందామా?
చారమ్మ పరమ చిరాకుగా చస్తామ?తీసుకుందాం అంది.

బ్రేక్
మా పేట వంటకి తిరిగి స్వాగతం.

యా: చారమ్మ గారూ! ఈ సారి సరిగానే అయినట్టుంది.
చా:ఆ!అయింది.
యా:తరువాత ఏం చేయాలండీ!
చా:ఇపుడు పెరుగు,పంచదార కలపాలి.
యా:చారమ్మ గారూ! మీకెంత మంది పిల్లలు?
చా:ఉన్నారు.ఇద్దరు.ఇద్దరికీ వాల్ల అయ్య పోలికలే వచ్హయి.
యా:చాల సంతొషం.
చా:
ఏమితి సంతోషం? నీ మొహం? పోలికలు ఒక్కటే వస్తే బాగానే ఉండేది.వెధవ బుద్ధులు కూడా అవే వచ్చాయి.
ఎక్కడికి పోతాయి,వంశం అంతా అంతే.
యాంకర్, టాపిక్ మార్చకపోతే ఎక్కడ తన మీద పడుతుందేమోనని మాటని వంట మీదకి మార్చింది.

ఇక దీనికి పొట్లకాయ ముక్కలు కలిపేద్దామా?
చా:ఆ,కలిపేద్దాం!

యా:మీకు బాగా ఇష్టమైన కూర ఏమిటండీ?
చా:వంకాయ కారం.
యా:మీ వారికి,మీ పిల్లలకీ?
చా:నా బొంద,నీ బొంద!ఏదన్నా నచ్చి చస్తే కదా!ఏనాడైనా బాగుందని చెప్పి ఏడిస్తే కదా!బావురుపిల్లి మొహలేసుకుని ఆవురావురుమంటూ,మేక ఆకులు నమిలినట్టు నమలడం తప్ప,ఎక్కడికిపోతాయి లక్షణాలు.మా అమ్మా.నాన్నా ఏదో వెలగపెడతాదని అంటాగట్టారు నాకు ఆ అడకత్తెర మొహాన్ని.
మళ్ళీ ఆ యాంకర్ పరిస్థితి అద్ధ్వాన్నంగా మారింది.తక్షణ తరుణోపాయంగా మళ్ళీ మాట వంట మీదకి మార్చింది.

ఇది పూర్తి అయినట్టుంది.
చా:అవునమ్మాయి,నువ్వు రుచి చూడడమే తరువాయి.
యా:చూడడానికి అంత బాగోలేక పోయినా తినడానికి బాగానే ఉంటుందేమోలెండి.
అవును,ఈ వంటకం మాకు పరిచయం చేయడనికి కారణం ఏంటండీ?
చ:(చీదుతూ)మా ఆయన చివరి సారిగా రుచి చూసిన వంటకం ఇదేనమ్మా.
య:మరి ఎలా పోయారండీ అంత సడంగా?
చ: ఏం చెప్పనమ్మా?ఇది తిన్నారా!తరువాత వెంటనే పడకెక్కారు,తరువాత వెనువెంటనే పాడెకెక్కారు.

నా బాధకేం గాని నువ్వు రుచి చూడమ్మా.
య:(ఇంకేం రుచి చూస్తాం?)